సాక్షి, నెల్లూరు జిల్లా: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అవినీతి బట్టబయలైంది. రీచ్ టు రిచ్‌కు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి భారీగానే ప్లాన్ వేశారని స్పష్టమవుతోంది. ఇసుక అక్రమ రవాణా ద్వారా రూ.వందల కోట్లు సంపాదించాలని టార్గెట్‌గా పెట్టుకున్న ఆయన మనుషులు సూరాయపాళెం ఇసుక రీచ్‌లో సాగించిన హెచ్చరికలు, దూషణల పర్వం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డ్రెడ్జింగ్ విధానంలో ఇసుక వెలికి తీసేందుకు వచ్చిన గుంటూరుకు చెందిన శ్రీకృష్ణ శాండ్ అండ్ ఫెర్రీ బోర్డ్ వర్కర్స్ అండ్ అదర్ వర్క్స్ లేబర్ కాంట్రాక్ట్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కాంట్రాక్టర్లను సోమిరెడ్డి మనుషులు బెదిరించారు. పొదలకూరు మండలం సూరాయపాళెం ఇసుక రీచ్ నుంచి అక్రమంగా ఇసుకను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న సోమిరెడ్డి తన మనుషులను రీచ్ వద్దకు పంపి డ్రెడ్జింగ్ వినియోగించే పడవలను వెనుక్కు పంపే ప్రయత్నం చేశారు. సాక్షాత్తు కలెక్టర్‌నే తూలనాడారు. స్థానిక శాసన సభ్యుడిని కాదని మీరు ఏమి చేయలేరని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగారు.
చంద్రబాబునాయుడు స్థానిక ఎమ్మెల్యేలకు ఇసుక రీచ్‌లను నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టాలని చూస్తున్నారని చెప్పా రు. మధ్యలో కలెక్టర్ ఓవరాక్షన్ చేస్తున్నాడంటూ బూతుపురాణం అందుకున్నాడు. కలెక్టర్ నుంచి కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్లు పద్ధతి ప్రకారం డ్రెడ్జింగ్ చేసేందుకు వచ్చారు. అయితే సోమిరెడ్డి అనుచరులు డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను వెలికి తీస్తే ఎలాంటి ఆదాయం ఉండదని, మధ్యలో ఇసుక దిబ్బలను ఎత్తాలని సూచించారు.
ఇదీ చదవండి: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు టీడీపీ నాయకుల దాడి
ఇందు కోసం తాము 300 ట్రిప్పుల గ్రావెల్ తోలి రీచ్‌కు దారులు ఏర్పాటు చేస్తున్నామని, రూ.కోట్లు ఖర్చు పెడుతున్నట్టు చెప్పారు. ఆయన (సోమిరెడ్డి) ఇంత చేస్తుంటే.. మీరు ఆయనకు తెలియకుండా ఏమైనా చేసినట్లు తెలిస్తే చాలా గొడవలు అవుతాయంటూ కంఠస్వరం పెంచుతూ మాట్లాడారు. ఈ మాటలను బట్టి చూస్తే ఉచిత ఇసుక పాలసీ డొల్లతనం ఇట్టే అర్థం అవుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, తమ్ముళ్లు ఇసుక ద్వారా సొమ్ము చేసుకోవాలని ఎంతగా పరితపిస్తున్నారో తెలుస్తోంది. ఓ పక్కన రైతులు ఇసుక తోడేస్తే భూగర్భ జలాలు అడుగంటుతాయని, పర్యావరణకే ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే టీడీపీ నాయకులు ఇసుక ద్వారా అక్రమ సంపాదనకు తమ లక్ష్యాలను నిర్ధేశించుకుని వెనుక్కు తగ్గడమే లేదు.
Comments
Please login to add a commentAdd a comment