ఎమ్మెల్సీ టిక్కెట్ కోసం ముగ్గురు నేతల పోటీ
కాకినాడ జిల్లా నుంచి పోటీలో పిల్లి సత్తిబాబు.. కోనసీమ జిల్లా నుంచి పేరాబత్తుల రాజశేఖర్
తూర్పుగోదావరి నుంచి రేసులో మాజీ మంత్రి జవహర్
మరికొందరూ బరిలోకి రావొచ్చంటున్న పార్టీ వర్గాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక తెలుగుదేశం పార్టీలో మూడు ముక్కలాటకు తెరతీసింది. ప్రస్తుతం గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు (ఐవీ) పదవీ కాలం ముగియడంతో ఎన్నికలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఉపాధ్యాయ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన ఐవీని ప్రజా సంఘాలన్నీ ఏకమై ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) పేరుతో గెలిపించుకున్నాయి.
పట్టభద్రుల స్థానానికి జరిగే ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరగాలని ఓటర్లు అభిలషిస్తుంటారు. కానీ టీడీపీ ఈ ఎన్నికల్లోనూ తమ వారినే బరిలోకి దింపడానికి సిద్ధమైంది. దీంతో మూడు సామాజికవర్గాల నుంచి మూడు జిల్లాలకు చెందిన ముగ్గురు టీడీపీ నేతలు రేసులోకి వచ్చారు. కాకినాడ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్తిబాబు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గుత్తెనదీవికి చెందిన ఐ.పోలవరం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పేరాబత్తుల రాజశేఖర్, తూర్పు గోదావరి జిల్లా నుంచి మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ ఈ రేసులో ఉన్నారు.
వీరు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. ఒకరిని ఒకరు అడ్డుకొంటూ టిక్కెట్ దక్కించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. వారికి టిక్కెట్ దక్కకుండా వ్యతిరేక వర్గాలు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో పెద్ద రగడే జరుగుతోంది. ఎన్నికలు సమీపించే కొద్దీ మరికొందరు కూడా రేసులోకి రావొచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు.
చాన్స్ ఇవ్వాల్సిందేనంటున్న సత్తిబాబు
బీసీలలో బలమైన శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన పిల్లి సత్తిబాబు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. ఇటీవలి ఎన్నికల్లో చంద్రబాబు మాటకు కట్టుబడి కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని కూటమికి త్యాగం చేశామని, పార్టీ అధికారంలోకి వచ్చాక సముచిత ప్రాధాన్యం కల్పిస్తానని బాబు ఇచ్చిన హామీపై నమ్మకంతోనే కూటమి విజయానికి పనిచేశామని సత్తిబాబు వర్గీయులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ చాన్స్ ఇవ్వకపోతే లేదంటే తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు.
తమకే కావాలంటున్న కాపు సామాజికవర్గం
కోనసీమ జిల్లా నుంచి బీసీ సామాజికవర్గంలో వాసంశెట్టి సుభాష్‌కు రాష్ట్ర కేబినెట్‌లో చోటు దక్కడంతో పట్టభద్రుల స్థానాన్ని పేరాబత్తుల రాజశేఖర్‌కు ఇవ్వాలని కాపు సామాజికవర్గం పట్టుబడుతోంది. ఆ వర్గం నేతలు ఇటీవల చంద్రబాబును కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో రాజశేఖర్ కాకినాడ రూరల్ స్థానం ఆశించారని, అధిష్టానం సూచనలతో జెడ్పీ చైర్మన్ సీటునూ వదులుకున్నామని గుర్తుచేస్తున్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ప్రచార కార్య్రకమాలకు సమన్వయకర్తగా కష్టపడ్డ రాజశేఖర్‌కు అవకాశం ఇవ్వకపోతే అంగీకరించేది లేదని అంటున్నారు.
జవహర్‌ను వ్యతిరేకిస్తున్న అచ్చిబాబు వర్గం
తూర్పు గోదావరి జిల్లాలో ఎస్సీ సామాజికవర్గం నుంచి మాజీ మంత్రి జవహర్ ఎమ్మెల్సీ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో కొవ్వూరు స్థానాన్ని ఆశించిన జవహర్‌కు చంద్రబాబు సామాజికవర్గం మోకాలడ్డటంతో సీటు దక్క లేదు. ఇప్పుడు మండలికి అవకాశం కల్పించాలని చంద్రబాబును ఎస్సీ సామాజికవర్గం కోరుతోంది. అయితే, జవహర్‌ను టీడీపీలోని మరో కీలక నాయకుడు పెండ్యాల అచ్చిబాబు వర్గీయులు అడ్డుకొంటున్నారు. అచ్చిబాబు వర్గం మంత్రి లోకేశ్‌ను ఆశ్రయించి జవహర్‌కు అవకాశం దక్కకుండా చేసే పనిలో ఉంది. చంద్రబాబు వద్ద జవహర్ ప్రాధాన్యాన్ని తగ్గించేందుకు ఈ వర్గంలోని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గట్టి ప్రయత్నం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment