జగిత్యాల జిల్లా: నిరుపేద నిరుద్యోగ యువకుడి బలవన్మరణం కేసులో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. యువకుడి బలవన్మరణానికి కారణం అయిన వ్యక్తి జైల్లో ఉంటే వాస్తవాలు తెలియకుండా కవిత ఆరోపణలు చేయడం విడ్డూరమని అన్నారు. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం భయపెడుతుందని భావించడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసినట్టే అందరూ చేస్తారనుకోవడం విచారకరమని అన్నారు.
'సారంగాపూర్ మండలం బట్టపల్లిలో శివ నాగేశ్వర్ అనే యువకుడు ఉరి వేసుకొని చనిపోతే A4గా ఉన్న సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డిని సైతం అరెస్ట్ చేయాలని రిపోర్ట్ లో ఉంది. అప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టే నేర నిర్ధారణ జరిగినా కూడా నిందితుడైన సర్పంచును పరారీలో చూపెట్టారు. రెండున్నర మాసాలు బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కొరకు ఎన్నిక ప్రక్రియలో బిజీగా ఉన్నాడు. సర్పంచ్ ఊరిలో ఉన్నా పోలీసులకు తెలియకపోవడం విచారకరం. ఎన్నికల్లో వెసులుబాటు కల్పించడానికి ఈ కుట్రకు తెరలేపారు. వాస్తవంగా పోలీసులపైనే చర్యలు తీసుకోవాలి. ఎవరు ఎవరికీ ఫ్రెండ్లి పోలీసో కవిత సమాధానం చెప్పాలి.' అని జీవన్ రెడ్డి అన్నారు.
చట్టం, పోలీస్ వ్యవస్థ పట్ల విశ్వాసం కోల్పోయి శివనాగేశ్వర్ ప్రాణం అర్పించుకున్నాడని జీవన్ రెడ్డి తెలిపారు. కొడుకును కోల్పోయిన తల్లి హృదయం ఏ విధంగా ద్రవించిందో ఒక తల్లిగా కవితకు తెలియదా..? అని ప్రశ్నించారు. ఆ బాధిత మృతుని తల్లిని కవిత పరామర్శిస్తే సంతోషించే వాడినని అన్నారు. ఎంతవరకు రాజకీయ కోణం తప్ప మానవత్వం లేదా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి పోలీసులు ఫ్రెండ్లీ కాబట్టి సర్పంచును అబ్ స్క్యాండింగ్ గా చూపించారని ఆరోపించారు. ఈ ఘటనపై ఎస్పీ స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: వారానికి రెండు ఢిల్లీ టూర్లు
Comments
Please login to add a commentAdd a comment