సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగావకాశాల్లో మహిళల హక్కులను హరించేలా రోస్టర్ పాయింట్లు లేని హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తెలంగాణలో ఆడబిడ్డలతో పాటు దివ్యాంగుల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల్లో ఆడబిడ్డలకు అన్యాయం చేసేలా ఉన్న జీవో 3ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాం«దీకి రాసిన లేఖలను కవిత సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు తీరని అన్యాయం చేస్తోందని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లు అమలవుతున్నాయని, మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తూనే వర్టీకల్ రిజర్వేషన్లతో సమానంగా అమలు చేయాలంటే రోస్టర్ పాయింట్లను పెట్టాలనే ప్రతిపాదన 1996లో తెరమీదికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం జీవో 41, 56లను జారీ చేసిందన్నారు. పాత విధానం ప్రకారం మహిళలకు కచ్చితంగా 33 శాతం ఉద్యోగాలతో పాటు అదనంగా మరిన్ని ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉండేందన్నారు. హారిజాంటల్ రిజర్వేషన్ విధానంతో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకే తీవ్రంగా నష్టం జరుగుతుందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డలకు అన్యాయం చేసే జీవో 3ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment