బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్సీ కసిరెడ్డి రాజీనామా | MLC Kasireddy resigned from BRS | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్సీ కసిరెడ్డి రాజీనామా

Published Mon, Oct 2 2023 3:05 AM | Last Updated on Mon, Oct 2 2023 3:05 AM

MLC Kasireddy resigned from BRS - Sakshi

కల్వకుర్తి/ఆమనగల్లు/సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్‌ఎస్‌ పారీ్టకి రాజీనామా చేశారు. అలాగే నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ బాలాజీసింగ్‌ కూడా బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు వీరు తమ రాజీనామా లేఖలను సీఎం కేసీఆర్‌కు పంపించినట్లు సమాచారం. ఆదివారం హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో ఆయన నివాసంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, బాలాజీసింగ్‌ భేటీ అయ్యారు.

కల్వకుర్తిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారం¿ోత్సవానికి మంత్రి హరీశ్‌రావు వచ్చిన రోజే వీరు పార్టీని వీడటం చర్చనీయాంశమైంది. ప్రజల అభీష్టం మేరకే పార్టీని వీడుతున్నామని వీరు చెప్పారు. నాలుగేళ్లు ఎమ్మెల్సీ పదవీకాలం ఉన్నా ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు, ఈ ప్రాంతానికి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని కసిరెడ్డి పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ తనకు రెండు సార్లు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, అందుకు వారికి కృతజ్ఞతలు అని తెలిపారు. కాగా ఆయన ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ పార్టీ తరఫున కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెపుతున్నారు. 

ఫలించని బుజ్జగింపులు 
ఇదిలా ఉండగా అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని బుజ్జగించడానికి బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు పలుదఫాలు మంతనాలు జరిపారు. మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్‌ రెండుసార్లు ప్రగతి భవన్‌లో మంతనాలు జరిపినా బుజ్జగింపులు ఫలించలేదని చెపుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో టికెట్‌ ఇస్తారనే నమ్మకంతో ఆయన బీఆర్‌ఎస్‌ను వీడినట్లు సమాచారం. ఆదివారం రేవంత్‌రెడ్డితో జరిగిన భేటీలో పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

లక్ష్యం నెరవేరలేదు: కసిరెడ్డి 
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి తొమ్మిదేళ్లు అవుతున్నా లక్ష్యం నెరవేరలేదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్న సంకల్పంతో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని, ఇటీవల తుక్కుగూడ సభలో ఆమె ప్రకటించిన ఆరు గ్యారంటీలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందన్న నమ్మకం తనకు కలిగిందని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. సోనియా పిలుపుతో కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని ఆ లేఖలో తెలిపిన కసిరెడ్డి.. బీఆర్‌ఎస్‌లో తనకు ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతలు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement