సీఎం రేవంత్ కొత్త జీవోను వ్యతిరేకిస్తూ.. సోనియాకు ఎమ్మెల్సీ కవిత లేఖ | MLC Kavitha Letter To Sonia Gandhi On CM Revanth New GO On Women Reservation, Details Inside - Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్ కొత్త జీవోను వ్యతిరేకిస్తూ.. సోనియాకు ఎమ్మెల్సీ కవిత లేఖ

Published Mon, Feb 19 2024 12:19 PM | Last Updated on Mon, Feb 19 2024 5:42 PM

MLC kavitha letter To Sonia Gandhi On CM Revanth New GO On Women Reservation - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ అవలంభిస్తున్న వైఖరిపై విమర్శలు గుప్పించారు. రిజర్వేషన్ల స్ఫూర్తిని పక్కనబెడుతూ సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటూ ఫిబ్రవరి 10న కొత్త జీవో తీసుకురావడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ఆడబిడ్డల హక్కులను కాంగ్రెస్‌ తుంగులో తొక్కుతుందని, ఈ అంశంపై జాతీయ పార్టీ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

‘1996లో అనేక పోరాటాల ఫలితంగా మహిళలకు ఉపాధి అవకాశాల్లో 33.3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నంబర్‌ 41, 56 జారీ అయ్యాయి. దీనికి 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఇందిరా సాహ్ని తీర్పు కూడా ఎంతో తోడ్పాటునిచ్చింది. ఆ తర్వాత రాజ్యంగబద్ధంగా మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లు కల్పించారు. మన దేశంలో సామాజిక రిజర్వేషన్లు ఎలా అయితే ఉన్నాయో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేసే పద్ధతి నడుస్తోంది.

ఇన్నేళ్ల నుంచి సాగుతున్న ఈ పద్ధతిని ఇటీవల రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకొని తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తూ జీవో 41, 56ను రద్దు చేస్తూ ఈ నెల 10న కొత్తగా జీవో 3ను తీసుకువచ్చింది. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసినా.. తాము మహిళల హక్కులను హరించబోమని 2023 జనవరిలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.


చదవండి: కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్‌.. ఆ జాబితాపై హైకమాండ్‌తో భేటీ

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరితో సంప్రదింపులు జరపకుండా మహిళల హక్కులకు భంగం కలిగిస్తూ ఈ నెల 6న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. తద్వారా మహిళల హక్కులను సంపూర్ణంగా, శాశ్వతంగా హరిస్తూ రోస్టర్ పాయింట్లు లేకుండా హారిజాంటల్ పద్ధతిలో రిజర్వేషన్లను కల్పిండానికి జీవో 3ను ప్రభుత్వం జారీ చేసింది. ఇది మహిళల ఉద్యోగావకాశాలకు శరాఘాతంగా నిలవనుంది. 

ఉదాహరణకు ఈ ఏడాది దాదాపు 2 లక్షల 50 వేల మంది ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో నమోదుచేసుకున్నారు. వారిలో లక్ష మంది ఆడబిడ్డలు ఉన్నారు. ఈ ఏడాది 2 లక్షల కొలువులు ఇస్తామని ప్రభుత్వం చెబుతుంనది. అంటే 33.3 శాతం రిజర్వేషన్ల మేరకు కనీసం 66 వేల మంది మహిళలకు ఉద్యోగాలు కచ్చితంగా రావాలి. అదనంగా మరింత మంది మహిళలకు ఉద్యోగాలు లభించాలి. అదే ఈ రిజర్వేషన్ల స్ఫూర్తి. దీనిని పక్కనబెడుతూ సీఎం రేవంత్ రెడ్డి కొత్త జీవో తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాను.

ఈ అంశంపై జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలి. సుప్రీంకోర్టు తీర్పును పాటించబోమంటూ బీహార్, కర్ణాటక రాష్ట్రాలు జీవోలు జారీ చేశాయి. కానీ తెలంగాణలో మాత్రం మీ గ్యారెంటీతో ఇందిరమ్మ రాజ్యంగా చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఇంటి ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతోంది. ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆ జీవోను తక్షణమే వెనక్కి తీసుకునేలా ముఖ్యమంత్రికి ఆదేశాలు జారీ చేయాలి’ అని విజ్ఞప్తి చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement