వికసిత్ భారత్ కోసం అన్ని రాష్ట్రాలతో కలిసి పని చేస్తాం
అవినీతిపై ఇక ఉక్కుపాదం మోపడం ఖాయం
ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగం తమకు మార్గం చూపే దారిదీపం అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ‘అభివృద్ధి చెందిన భారత్’ తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. లక్ష్య సాధన కోసం పారీ్టలకు అతీతంగా అన్ని రాష్ట్రాలతో కలిసి పని చేస్తామని చెప్పారు. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం ఆయన బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. జై జగన్నాథ్ అంటూ ప్రసంగం ప్రారంభించారు.
ప్రధానమంత్రిగా మూడో పర్యాయంలో అవినీతిపై ఉక్కుపాదం మోపుతానని చెప్పారు. అవినీతిని నిర్మూలించడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఎన్నికల్లో విపక్ష కూటమి సాధించిన మొత్తం సీట్ల కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చాయని అన్నారు. కేంద్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తుండడం ఆరు దశాబ్దాల తర్వాత ఇదే మొదటిసారి అని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఒడిశా ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీయే పక్షాలకు సైతం కృతజ్ఞతలు తెలియజేశారు. ‘దేశమే ప్రథమం’ స్ఫూర్తితో ఆత్మనిర్భర్ భారత్ దిశగా అసాధారణ నిర్ణయాలు తీసుకుంటామని పేర్నొన్నారు.
మహిళలే కేంద్రంగా అభివృద్ధి నమూనా
తన తల్లి మృతి చెందిన తర్వాత తనకు ఇది మొదటి ఎన్నిక అంటూ ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. దేశంలోని కోట్లాది మంది మహిళలు తనపట్ల ఆప్యాయత ఆదరణ చూపించారని, ఆశీస్సులు అందించారని, తనకు తల్లి లేని లోటు కని్పంచకుండా చేశారని వెల్లడించారు. మహిళలే కేంద్రంగా అభివృద్ధి నమూనాను కొనసాగిస్తామని ప్రకటించారు. యువత సాధికారత కోసం కృషి చేస్తామన్నారు. భవిష్యత్తు మొత్తం ఇకపై హరిత శకానిదేనని, గ్రీన్ ఎకానమీలో పెట్టుబడులు పెంచుతామని హామీ ఇచ్చారు.
వాతావరణ మార్పుల నుంచి ఆహార భద్రత దాకా భిన్న రంగాల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు భారత్ పరిష్కారం చూపుతుందన్నారు. బలమైన భారత్ బలమైన ప్రపంచానికి బలమైన మూలస్తంభంగా నిలుస్తుందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రజలు 10 గంటలు పని చేస్తే తాను 18 గంటలు పని చేస్తానన్నారు. వారు రెండు అడుగులు వేస్తే తాను నాలుగు అడుగులు వేస్తానన్నారు. మనమంతా కలిసికట్టుగా పనిచేస్తే కీలక నిర్ణయాలు తీసుకోవడంలో భారత్ కొత్త అధ్యాయం లిఖిస్తుందని, ఇది మోదీ గ్యారంటీ అని వివరించారు. దేశంలో అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఎన్డీయే పని చేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment