సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ కరీంనగర్‌టౌన్: రాష్ట్రంలో బీఆర్‌ఎస్సో, కాంగ్రెస్సో అధికారంలోకి వస్తే మళ్లీ ఎన్నికలు వచ్చే ప్రమాదముందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం కుర్చీ కోసం కొట్లాటలు తప్పవని, తద్వారా కొద్దిరోజులకే ఆ ప్రభుత్వం కుప్పకూలుతుందన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ సీఎం అవుతారని, అప్పుడు ఆ పారీ్టలో చీలికలొచ్చి ప్రభుత్వం పడిపోతుందని జోస్యం చెప్పారు.
రాష్ట్రం సుస్థిరంగా ఉండాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ వ్యక్తిని సీఎంను చేసి తీరుతామన్నారు. నారాయణపేట నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కె.రతంగ్‌పాండురెడ్డి బుధవారం నామినేషన్ వేశారు. అనంతరం సత్యనారాయణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ బండి మాట్లాడారు. కేసీఆర్ లేకుంటే నిన్ను కుక్కలు కూడా దేకవు అని కేటీఆర్‌ను బండి దుయ్యబట్టారు.
‘‘అమెరికాలో చిప్పలు కడుక్కునే వాడివి...2004లో నెలకు జీతం రూ.4 లక్షలు అన్నావు...ఇప్పుడేమో కోటి అంటావు...నెలకు కోటి లెక్క చేసిన ఐదేళ్లకు దాదాపు వంద కోట్లు అనుకో...మరి లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసినవ్ కదా..ముందు ఆ లక్ష కోట్ల సంగతి తేల్చు’’అని సవాల్ విసిరారు.
హెలికాప్టర్‌లో ఎన్నికల ప్రచారానికి బండి
బండి సంజయ్‌ను స్టార్ క్యాంపెయినర్‌గా ఎంపిక చేసిన బీజేపీ అధిష్టానం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి సభల్లో పాల్గొనేందుకు ఆయనకు హెలికాప్టర్‌ను కేటాయించింది. దీంతో బుధవారం కరీంనగర్ నుంచి నారాయణపేట జిల్లాకు సభలో పాల్గొనేందుకు సంజయ్ హెలికాప్టర్‌లో బయల్దేరి వెళ్లారు. రెండోరోజు బుధవారం పాదయాత్రలో భాగంగా కరీంనగర్‌లోని 6, 29, 30 పాతబజార్ శివాలయం నుంచి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నాగూరావు నామాజీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు పగడాకుల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు సత్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment