ధనికులపైనే చంద్రబాబుకు ప్రేమ.. పేదలంటే బాబుకు చులకన
టిప్పర్ డ్రైవర్‌కు టికెట్ ఇస్తే అవమానకరంగా మాట్లాడుతున్నారు
మోదీతో పొత్తు దేని కోసమో... చంద్రబాబు ప్రజలకు చెప్పాలి
విజయవాడ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపై ఎంపీ కేశినేని నాని ఫైర్
ఆటోనగర్(విజయవాడ తూర్పు): పెద్దమొత్తంలో ఎవరు డబ్బు ముట్టచెబితే వారికే చంద్రబాబు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్‌లు కేటాయిస్తున్నారని విజయవాడ వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ (నాని) ఆరోపించారు. క్యాష్ కొట్టు.. టికెట్ పట్టు అనే సిద్ధాంతాన్ని చంద్రబాబు అవలంభిస్తున్నారని విమర్శించారు. ఆదివారం విజయవాడ 15వ డివిజన్ రామలింగేశ్వరనగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. విజయవాడ తూర్పునియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుకు ధనికులంటేనే ప్రేమని, పేదలంటే చాలా చులకన భావంతో వ్యవహరిస్తారని అన్నారు. పేదలు పచ్చగా ఉంటే బాబు సహించలేరని విమర్శించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి నాడు నందమూరి తారకరామారావు తెలుగుదేశంపార్టీని స్థాపించారని, ఆ పార్టీ సిద్ధాంతాలను చంద్రబాబు సప్త సముద్రాల్లో కలిపేశారని మండిపడ్డారు.
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి టిప్పర్ డ్రైవర్‌కు అసెంబ్లీ టికెట్ కేటాయిస్తే దానిపై పబ్లిక్ మీటింగ్‌లో హేళనగా మాట్లాడారని దుయ్యబట్టారు. దీంతో పేదలు ఎమ్మెల్యే, ఎంపీలుగా ఉండకూడదన్న బాబు నైజం మరోసారి బయటపడిందన్నారు. నాడు ఎన్‌టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ గురించి ఆంధ్రా నుంచి ఢిల్లీ వరకు లారీలపై జెండాలు కట్టుకొని ప్రచారం చేసింది లారీ యజమానులేనని ఆయన గుర్తుచేశారు.
మోదీతో చంద్రబాబు పొత్తు దేని కోసం...
నరేంద్ర మోధీతో చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకున్నాడో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసమా.. రైల్వేజోన్ కోసమా.. లేదా రాజధానికి రూ.లక్ష కోట్లు తీసుకురావడానికా.. కడప ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు తీసుకురావడానికా, చంద్రబాబు మీద ఉన్న కేసులను మాఫీ చేయడానికా అనేది ప్రజలకు స్పష్టంగా చెప్పాలని నిలదీశారు.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమానికి రూ.2.66 లక్షల కోట్లు ఖర్చు చేశారన్నారు. ప్రజా సంక్షేమానికి గతంలో ఎవరూ ఇంతపెద్ద మొత్తంలో ఖర్చుచేయలేదన్నారు. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, మేమంతా సిద్ధం అనే కార్యక్రమానికి బ్రహ్మరథం పడుతున్నారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment