సాక్షి, అమరావతి: ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులకు మాజీ సీఎం చంద్రబాబు తక్షణమే సమాధానం చెప్పాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. విజనరీగా చెప్పుకునే ఆయన పొలిటికల్ స్కామ్‌స్టర్ అని ధ్వజమెత్తారు. కమీషన్లుగా దండుకున్న రూ.118.98 కోట్లపై నోరు మెదపకుండా నీతులు వల్లిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అక్రమార్జనలో ఇది చిన్న భాగం మాత్రమేనని, క్షుణ్నంగా విచారిస్తే భారీ కుంభకోణాలు బహిర్గతం కావడం ఖాయమన్నారు.
- ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కుంభకోణాలను అప్పట్లోనే తెహల్కా బయటపెట్టింది. అక్రమార్జనపై 17 కేసుల్లో చంద్రబాబు విచారణ ఎదుర్కోకుండా వ్యవస్థలను మేనేజ్ చేసి స్టేలు తెచ్చుకున్నారు.
- ఢిల్లీలో రూ.700–రూ.800 కోట్లతో అత్యద్భుతమైన పార్లమెంట్ భవనాన్ని కేంద్రం నిర్మిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రూ.500 – రూ.600 కోట్లతో సచివాలయ భవనాన్ని నిర్మించింది. ఏసీ, ఇంటీరియర్స్ సహా చదరపు అడుగు నిర్మాణానికి రూ.2 వేల నుంచి రూ.మూడు వేలు వ్యయం అవుతుంది. చంద్రబాబు మాత్రం చదరపు అడుగుకు రూ.13 వేల నుంచి రూ.14 వేలు ఖర్చు పెట్టి రేకుల షెడ్డు లాంటి తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించారు. దీన్ని బట్టి చూస్తే షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థల నుంచి చదరపు అడుగుకు రూ.పది వేలకుపైగా ముడుపులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి చేరాయి.
- పోలవరంలో వరదను మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను నిర్మించకుండానే ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్‌ను చంద్రబాబు చేపట్టారు. దీంతో 2019–20లో గోదావరికి వచ్చిన భారీ వరదలు ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో డయాఫ్రమ్ వాల్ కోతకు గురైంది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో అగాధాలు ఏర్పడ్డాయి. వాటిని యధాస్థితికి తేవడం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం రూ.2 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఇంత నష్టానికి కారకుడు చంద్రబాబే. ఈ పాపానికి చంద్రబాబు పాల్పడకుంటే పోలవరం ఈ పాటికి ఎప్పుడో పూర్తయ్యేది. చంద్రబాబు పాపాలను సీఎం వైఎస్ జగన్ ప్రక్షాళన చేస్తూ ప్రణాళికాబద్ధంగా పోలవరాన్ని పూర్తి చేస్తున్నారు. తొలి దశ పూర్తికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. రాష్టంలో 2014–19 మధ్య పేదరికం 11.66 శాతం ఉండగా, సీఎం జగన్ సంక్షేమ పథకాల వల్ల 6 శాతానికి తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment