
సాక్షి, చిత్తూరు: కుప్పం ప్రజలను పచ్చిగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నిలబెట్టుకోలేకపోయారు. ఇప్పుడు జగనన్న అమలు చేస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారు. పేదలకు నివాస గృహాలు ఇస్తుంటే ఎందుకు చంద్రబాబుకు కడుపు మంట..?. కోర్టుల్లో తప్పుడు కేసులు వేయిస్తున్నారు. పేదల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.
2014 ఎన్నికల సందర్భంగా డ్వాక్రా రుణాలు, మహిళల బంగారు నగల రుణాలు మాపీ చేస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చాక హామీలను నెరవేర్చలేదు. చంద్రబాబు పాలనలో కుప్పంలో బాగుపడింది ఐదుగురు మాత్రమే. ఆ ఐదు మంది పెద్దపెద్ద బంగ్లాలు కట్టుకున్నారు. పేదలకు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదు. కుప్పంలో త్వరలోనే 10 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తాం. ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందిస్తాం. మున్సిపల్ ఎన్నికల్లో మీ ఆశీర్వాదం కావాలి' అని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు.