నామినేషన్ దాఖలు చేస్తున్న కేఏ పాల్
చండూరు : మునుగోడులో తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఆయన శుక్రవారం చండూరులోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ అందజేశారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో నాటి నుంచి చిత్ర, విచిత్రాలెన్నో చోటుచేసుకుంటున్నాయని చెప్పారు.
మునుగోడు ఉప ఎన్నికలలో గద్దర్ ప్రజా శాంతి పార్టీ తరుఫున పోటీ చేయకుండా కొంతమంది బెదిరించారని ఆయన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఆనాటి నుంచి నేటి వరకు అనేక విధాలుగా వెనుకబడి పోయిందన్నారు. తాను ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృషి పెట్టనున్నట్లు ప్రకటించారు.
మునుగోడులో ప్రజాస్వామ్యం ఖూనీ
హూజూరాబాద్ తర్వాత మళ్లీ మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు అగ్రకుల పార్టీలు సిద్ధమయ్యాయని, ఓట్లను అత్యధిక రేటుకు కొనేందుకు ముందుకువస్తున్నాయని డీఎస్పీ (దళితశక్తి ప్రోగ్రాం) పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ మండిపడ్డారు.
శుక్రవారం చండూరులో డీఎస్పీ అభ్యర్థి వేల్పుల గాలయ్య నామినేషన్ తరువాత నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. వేల కోట్ల సంపద ఉన్న అగ్రకుల అభ్యర్థులకు దీటుగా అట్టడుగు నిరుపేద అయిన వ్యక్తి గాలయ్యను బరిలో నిలుపుతున్నట్లు చెప్పారు. ఓట్లను అమ్మడం కొనడం పెద్ద నేరమని, గ్రామాల్లో మద్యం, డబ్బులు పంచుతున్నారని ఆయన అన్నారు.
కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీలు రెడ్డి వర్గానికి టికెట్ ఇవ్వడం దుర్మార్గమన్నారు. మునుగోడులో ఉన్న రెండు లక్షల పది వేల ఓట్లున్న బీఎస్పీ, ఎస్సీ, ఎస్టీల పరిస్థితి ఏమిటని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్ అభ్యర్థుల ఖర్చును కేవలం రూ.40 లక్షల వరకు మాత్రమే పరిమితి విధిస్తే ఈపాటికే కోట్ల రూపాయలు ఖర్చు చేసిన నాయకుల పై చర్యలు ఏవని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో డీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్, హరీష్ గౌడ్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: మునుగోడు ఓటర్ల లెక్క తేలింది.. ఎంతంటే!)
Comments
Please login to add a commentAdd a comment