సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను మూడింట ఒక వంతు స్థానాల్లో ముస్లింల ఓట్లే కీలకం కానున్నాయి. ఈ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపితే.. వారి గెలుపు కాస్త సులభతరం అయ్యే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో దాదాపు 14% వరకు ముస్లింల జనాభా ఉండగా 40 వరకు నియోజకవర్గాల్లో వీరి ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే వీరి మద్దతు పొందిన పార్టీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయం స్పష్టమవుతోంది. ఈ కారణంగానే పోటీలో ఉన్న ప్రధాన పార్టీలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారిని తమ వైపు ఆకర్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈసారి ముస్లింలు ఎవరికి మద్దతు పలికే అవకాశం ఉందనేది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత మెజారిటీ వర్గం ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బీఆర్‌ఎస్)కే మద్దతు ఇస్తూ వచ్చింది. అంతకుముందు వీరు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా ఉన్న సంగతి తెలిసిందే. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సమయంలో డాక్టర్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇవ్వడమేకాక.. ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారు. తర్వాత 2014 ఎన్నికల నుంచి బీఆర్‌ఎస్‌కు ముస్లింలు మద్దతుగా నిలిచారు. ఎంఐఎం) పూర్తిస్థాయి సహకారం ఈ పార్టీకి లభిస్తూ వస్తోంది.
ఈసారి కూడా ఎంఐఎం పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో మినహా మిగతా చోట్ల పార్టీ కార్యకర్తలతో పాటు యావత్ ముస్లింలు బీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఒక ప్రకటనలో బహిరంగంగానే విజ్ఞప్తి చేశారు. కానీ ఈసారి పరిస్థితిలో కాస్త మార్పు వచ్చే అవకాశం ఉందని, ఆ పార్టీ వర్గాల్లోనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గంపగుత్తగా ఓట్లు పడే అవకాశం లేదంటూ.. కర్ణాటక ఎన్నికల్లో అక్కడి ముస్లింలు జేడీఎస్‌ను కాంగ్రెస్‌కు బాసటగా నిలవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ కూడా ఆ విధమైన వాతావరణం ఏర్పడే చాన్స్‌ను తోసిపుచ్చలేమని అంటున్నారు.
రాజధాని నియోజకవర్గాలతో పాటు..: హైదరాబాద్ నగర పరిధిలోని యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, చార్మినార్, మలక్‌పేట, బహదూర్‌పురా, నాంపల్లి, కార్వాన్, ఖైరతాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, అంబర్‌పేట, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు అధికంగా ఉన్నారు.
అదే విధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ అర్బన్, బోధన్, కామారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, ముధోల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మహబూబ్‌నగర్, నారాయణపేట, ఉమ్మడి రంగారెడ్డిలోని తాండూరు, మల్కాజిగిరి, మహేశ్వరం, వికారాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ముస్లిం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాగా వీరి మద్దతుతో ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీయేతర నియోజకవర్గాల్లో పాగా వేయాలని అధికార బీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి.
ఆ మూడూ ఒక్కటే అంటూ కాంగ్రెస్...: కర్ణాటకలో గెలుపుతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా మైనారిటీలను తమ వైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే బీజేపీకి బీఆర్‌ఎస్ బీ టీంగా వ్యవహరిస్తోందని, బీజేపీతో రహస్య ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనంటూ గుర్తు చేస్తోంది.
ముందు నుంచి మైనారిటీలపై కాంగ్రెస్‌ది సానుకూల దృక్పథమేనని చెబుతోంది. బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు మూడూ ఒక్కటేనని, అంతర్గత అవగాహనతో పనిచేస్తున్నాయనే ప్రచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ఇతర రాష్ట్రాలలోని సీట్లలో ఎంఐఎం పోటీ చేస్తూ బీజేపీకి సహకరిస్తోందని ఆరోపిస్తోంది. మైనారిటీల సంక్షేమానికి భవిష్యత్తులో కూడా కట్టుబడి ఉంటామని గట్టిగా హామీ ఇస్తోంది.
సంక్షేమ పథకాలే ఆలంబనగా బీఆర్‌ఎస్..: మైనారిటీలను ఆకట్టుకోవడానికి బీఆర్‌ఎస్ గడచిన తొమ్మిదిన్నరేళ్లుగా ఆ వర్గానికి అందించిన సంక్షేమ పథకాలపైనే భరోసా పెట్టుకుంది. ఈసారి కూడా ముస్లింలు తమకే మద్దతు పలుకుతారనే ధీమాతో ఉంది. అదే సమయంలో వారు తమ చేజారే అవకాశం లేకుండా.. తాము బీజేపీతో ఎట్టిపరిస్థితుల్లోనూ కలిసే అవకాశం లేదంటూ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలే పరస్పరం సహకరించుకుంటున్నారంటూ ప్రతి విమర్శలు చేస్తోంది. మరోవైపు మైనారిటీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించడమేకాకుండా..మంత్రివర్గంలో కీలకమైన పదవిని ఆ వర్గానికి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తోంది. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మత సామరస్యం కొనసాగుతుండటాన్ని, కర్ఫ్యూల్లాంటివి లేకుండా ప్రజలు ప్రశాంతంగా జీవిస్తుండటాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావిస్తోంది.
ఇటీవలి బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్..వినాయక నిమజ్జన సమయంలో ముస్లింలు పెద్ద మనస్సు చేసుకుని మిలాద్ ఉన్ నబీ ఊరేగింపును వాయిదా వేసుకున్నారంటూ పదే పదే గుర్తు చేయడం ద్వారా ఆ వర్గానికి మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుండటం కూడా గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment