
కర్ణాటక ప్రెసిడెంట్ నలీన్ కుమార్ కతీల్ (ఫైల్ ఫోటో)
Nalin Kumar Kateel Audio Clip బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బీఎస్ యడియూరప్పను ముఖ్యమంత్రిగా తప్పించబోతున్నారనే వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో సీఎం మార్పుకు సంబంధించి కర్ణాటక బీజేపీ ప్రెసిడెంట్ నలిన్ కుమార్ కతీల్‌దిగా భావిస్తోన్న ఆడియో క్లిప్ ఒకటి ఆదివారం అంతా సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం 47 సెకన్ల నిడివి ఉన్న ఈ ఆడియో క్లిప్‌లో కతిల్‌గా భావిస్తున్న వ్యక్తి మరొకరితో తులు భాషలో మాట్లాడినట్లు ఉంది.
కతిల్‌గా భావిస్తున్న వ్యక్తి ‘‘దీని గురించి ఎవరికీ చెప్పవద్దు. మేము ఈశ్వరప్ప, షెట్టర్ బృందాన్ని తొలగిస్తాము. ఆ స్థానంలో కొత్త బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతా మన నియంత్రణలో ఉంటుంది. మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి.. వారిలో ఒకరిని ఎప్పుడైనా ప్రకటించవచ్చు. ఢిల్లీ ఆఫీసు కొత్త సీఏం పేరును ప్రకటిస్తుంది’’ అని ఉంది.
ఈ ఆడియో క్లిప్ వైరల్‌గా మారడంతో కతీల్ దీనిపై స్పందించారు. ‘‘ఇది ఫేక్ ఆడియో క్లిప్.. పార్టీలో కలహాలు సృష్టించడం కోసం ఎవరో నా గొంతును అనుకరించారు. దీనిపై సీఎం లోతైన దర్యాప్తు చేయాలని కోరాను’’ అన్నారు. సీఎం యడియూరప్ప స్థానంలో జూలై 26 న, బీజేపీ ఎమ్మెల్యేలు కొత్త కర్ణాటక ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
నాయకత్వ మార్పుపై ముఖ్యమంత్రి యడియూరప్ప స్పందించిన సంగతి తెలిసిందే. కర్ణాటక సీఎంగా కొనసాగాలని బీజేపీ కేంద్ర నాయకత్వం తనను కోరిందని యడియూరప్ప వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో జరిగిన భేటీల్లో రాష్ట్రంలో నాయకత్వ మార్పిడి అంశమే చర్చకు రాలేదని స్పష్టం చేశారు. కానీ రాష్ట్రంలో మాత్రం ఇందుకు భిన్నమైన వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment