![NCP Chief Sharad Pawar Withdraws Resignation - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/5/sharad-pawar_Resign.jpg.webp?itok=-VZxZMzH)
ముంబై: ఎన్సీపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం అధ్యక్ష పదివికి రాజీనామా చేసిన శరద్‌పవార్.. తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పార్టీ కార్యకర్తల ప్రేమ, అభిమానం, నమ్మకం తనను కదిలించాయని తెలిపారు. అందుకే వాళ్ల ఇష్టం మేరకు రాజీనామా ఉససంహరించుకుంటున్నట్లు చెప్పారు. తాను ఎప్పుడైనా కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటానని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా వాళ్లు తనతో ఉంటున్నారని చెప్పారు. వాళ్ల సెంటిమెంట్‌ను కాదనలేనన్నారు.
మంగళవారం తన ఆత్మకథ రెండో భాగం పుస్తకం విడుదల చేస్తూ రాజీనామా విషయాన్ని ప్రకటించారు శరద్‌పవార్. ఆ వెంటనే ఎన్సీపీ కార్యకర్తలు, నాయకులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. రాజీనామా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. దీంతో మూడు రోజుల తర్వాత పవార్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
కాగా.. మంగళవారం రాజీనామా అనంతరం పార్టీ అధినేతగా తన వారసుడిని ఎంపిక చేసేందుకు శరద్ పవార్ ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ శుక్రవారం సమావేశం అయ్యింది. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, సోదరుడి కుమారుడు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
దక్షిణ ముంబైలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో శరద్‌పవార్ రాజీనామా నిర్ణయాన్ని ఎన్సీపీ కమిటీ తిరస్కరించింది. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగాలని పార్టీ ప్యానెల్ శరద్‌ను కోరింది. దేశమంతా శరద్ పవార్ ప్రభావం ఉందని ఆ పార్టీ సినియర్ నేత ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు. ఆయన రాజీనామా చేస్తానంటే మేం ఊరుకోమని అన్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకే రాజీనామా ఉపసంహరించుకుంటున్నట్లు పవార్ ప్రకటించడంతో ఎన్సీపీ శ్రేణులు ఆనందం వ్యక్యం చేశాయి.
చదవండి: వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ'కి మద్దతు తెలిపిన మోదీ
Comments
Please login to add a commentAdd a comment