నెల్లూరును గ్రీన్‌సిటీగా అభివృద్ధి చేస్తా | Nellore will be developed as a green city | Sakshi
Sakshi News home page

నెల్లూరును గ్రీన్‌సిటీగా అభివృద్ధి చేస్తా

Published Sat, Mar 16 2024 5:08 AM | Last Updated on Sat, Mar 16 2024 5:08 AM

Nellore will be developed as a green city - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌ సహకారంతో అగ్రస్థానంలో నిలుపుతా

పుట్టినగడ్డకు సేవ చేసుకునే భాగ్యం కలిగింది

భారీ మెజారిటీతో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయం

నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త విజయసాయిరెడ్డి

నెల్లూరు (స్టౌన్‌హౌస్‌ పేట): సీఎం వైఎస్‌ జగన్‌ సహకారంతో వచ్చే ఐదేళ్లలో నెల్లూరును అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలబెడతానని వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త విజయసాయిరెడ్డి తెలిపారు. బెంగళూరు మాదిరిగా నెల్లూరును కూడా గ్రీన్‌ సిటీగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నెల్లూరు 14వ డివిజన్‌లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ నెల్లూరును ఒక శాస్త్రీయ విధానంలో అభివృద్ధి చేస్తానన్నారు. నెల్లూరులో పుట్టి, పెరిగి, విద్యాభ్యాసం చేసిన తనకు ఈ గడ్డకు సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ అవకాశవిుచ్చిన నగర ప్రజలకు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. రాజ్యసభ సభ్యుడిగా పదేళ్లు రాష్ట్రాభివృది్ధకి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశానని తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు కేంద్రం ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించేలా చేశానని చెప్పారు. ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ కృషితో 14వ డివిజన్‌లో బ్రాహ్మణుల కర్మకృతుల భవనం పూర్తయిందన్నారు.

అలాగే పద్మావతినగర్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం పూర్తి కావస్తోందని తెలిపారు. నెల్లూరు నగరం, గ్రామీణం పరిధిలో అనేక పార్కులు అభివృద్ధి చేసిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదేనని చెప్పారు. వ్యాపార వర్గాల్లో అభద్రతా భావం కలిగించే విధంగా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. వాటిని విశ్వసించవద్దన్నారు. ఎంపీ అభ్యర్థిగా తనకు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఖలీల్‌ అహ్మద్‌కు ప్రజలు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. 

బాబు పాలనంతా కరువు కాటకాలే..
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు ప్రజలంతా కరువుకాటకాలతో, ఆకలితో అలమటించి పోయారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. గతం కన్నా ఎక్కువ మెజారిటీతో వైఎస్సార్‌సీపీకి అధికారం కట్టబెట్టేందుకు, వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్‌ అహ్మద్‌ మాట్లాడుతూ విజయసాయిరెడ్డి రాకతో నెల్లూరు ప్రజల్లో, పార్టీ నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement