సీఎం జగన్ సంక్షేమ పాలనే మా ధైర్యం
పుట్టిన గడ్డకు రుణం తీర్చుకుంటా
ప్రజల నుంచి విశేష స్పందన
నెల్లూరు జిల్లాకు ఎయిర్ కనెక్టివిటీ నా ప్రధాన లక్ష్యం
సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ ముందంజలో రాష్ట్రం
ప్రశాంత్ కిషోర్‌ది స్వార్థంతో కూడిన తప్పుడు అభిప్రాయం
నెల్లూరు క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎంపీ విజయసాయి రెడ్డి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పార్లమెంటు స్థానంతో పాటు 7 అసెంబ్లీ నియోజక వర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని అందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు సంవత్సరాల పదినెలల కాలంలో ప్రజలకు అందించిన సుపరిపాలనే కారణమని రాజ్యసభ సభ్యులు, నెల్లూరు పార్లమెంట్ నియోజక వర్గ సమన్వయ కర్త వి విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
నెల్లూరు పట్టణంలో రామ్మూర్తి నగర్ లో బుధవారం క్యాంపు కార్యాలయం ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను నెల్లూరులో పుట్టానని, ఇక్కడే పెరిగానని, విద్యాభ్యాసం చేసానని తాను పుట్టిన గడ్డకు రుణం తీర్చుకునే అవకాశం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరుకు రోడ్డు, రైలు కనెక్టివిటీ ఉన్నప్పటికీ ఎయిర్ కనెక్టివిటీ లేదని, ఇక్కడ పరిశ్రమలు, అక్వా రంగం, వ్యవసాయ రంగ ఉత్పత్తులు ఎయిర్ కనెక్టివిటీ సదుపాయం కల్పించడంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు.
తాను పార్లమెంటులో టూరిజం, ట్రాన్స్ పోర్టు, కల్చర్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గా ఉన్నందున దగదర్తి ఎయిర్ పోర్టు నిర్మాణానికి మరింతగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే నెల్లూరు జిల్లా వాసిగా ఇక్కడి పరిస్థితులపై తనకు పూర్తి అవగాహన ఉందని, త్వరలోనే తన ప్రణాళిక వెల్లడిస్తానని అన్నారు.వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉన్నారని, ఈ మేరకు కందుకూరు నుంచి నెల్లూరు వరకు దారి పొడవునా ప్రజలు చూపించిన అభిమానమే ఇందుకు నిదర్శనమని అన్నారు.
చదవండి: ‘టీడీపీ బీసీ డిక్లరేషన్ కాపీ పేస్ట్.. మళ్లీ మోసం చేయడానికే’
సంక్షేమంలో దూసుకుపోతున్న జగన్ ప్రభుత్వం అభివృద్దిలో వెనుకబడిందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గత చంద్రబాబు పరిపాలనతో పోల్చుకుంటే 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి అందించిన సుపరిపాలనతో ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని అలాగే రాష్ట్ర స్థూల ఉత్పత్తి కూడా పెరిగిందని సూచికలు చెబుతున్నాయని అన్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారి జీవన ప్రమాణాలు పెంచారని అన్నారు.
సిద్దం సభలకు ప్రజల నుంచి విశేష స్పందన
జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో 2024 ఎన్నికలకు తామంతా సిద్ధంగా ఉన్నామని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, మేనిఫెస్టో అన్ని అంశాల్లోనూ సిద్ధంగా ఉన్నామని, ముఖ్యమంత్రి ఫేస్‌తో తాము ఎన్నికలకు సిద్దమని విజయసాయి రెడ్డి అన్నారు. ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ చేస్తుంటే రానున్న ఎన్నికల్లో 175 కి 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25కి 25 పార్లమెంట్ స్థానాలు గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.
ఐదేళ్ల అనుభవంతో రెట్టింపు సంక్షేమ పాలన
2019నుంచి 2024వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సుపరిపాలన, అన్ని వర్గాల ప్రజలకు అందించిన సంక్షేమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఐదేళ్ల అనుభవంతో రానున్న ఐదేళ్లలో రెట్టింపు సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు అందిస్తారని అందుకు ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు.
వాస్తవ పరిస్థితులకు విరుద్దంగా ప్రశాంత్ కిషోర్ అబిప్రాయం
ప్రశాంత్ కిషోర్ వెల్లడించిన అభిప్రాయానికి ఏమాత్రం లాజిక్ లేదని, స్వార్థ ప్రయోజనాలతో వ్యక్తపరిచిన స్వంత అభిప్రాయం మాత్రమేనని, ఆయన అభిప్రాయాలకు లాజికల్ ఆధారాలేవీ లేవని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎవ్వరూ అతని మాటలు విశ్వసించే పరిస్థితిలో లేరని అందుకు సీఎం జగన్‌పై చూపిస్తున్న అభిమానమే సాక్ష్యమని అన్నారు. మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి,నెల్లూరు మేయర్ స్రవంతి, పార్టీ ఎస్సీ విభాగ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరులో విజయసాయి రెడ్డికి ఘనస్వాగతం
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించిన అనంతరం బుధవారం నెల్లూరుకు చేరుకున్న ఎంపీ విజయసాయి రెడ్డికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కందుకూరు నియోజకవర్గం సరిహద్దు ప్రాంతం ఉలవపాడు జాతీయ రహదారి వద్ద కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్త బుర్రా మధుసూదన్ యాదవ్, ఇతర నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గజమాలతో సత్కరించి ఆహ్వానం పలికారు.
అక్కడి నుంచి వాహనాలతో ర్యాలీగా తరలివచ్చారు. అలాగే కావలి నియోజకవర్గం రుద్రకోట వద్ద ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గం సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో విజయసాయి రెడ్డికి ఘనస్వాగతం పలికారు. అనంతరం దగదర్తి మండలం ఉలవపాళ్ల గ్రామం వద్ద ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రం రెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. అనంతరం కోవూరు నియోజకవర్గం రాజుపాలెం ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో స్వాగతం పలికిన అనంతరం నెల్లూరు నగర పరిధిలోని అయ్యప్ప దేవాలయం వద్ద పూజ నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీతో విజయసాయి రెడ్డి ఇతర నాయకులతో కలిసి పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment