ఆ నేతకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరుంది. ఇప్పుడు ఆయన పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగడంతో ఆక్కడి విపక్షాలు కకావికలం అవుతున్నాయి. మొన్నటి వరకు ఎలాగొలా గెలుస్తాం అనుకున్న విపక్షం ట్రబుల్ షూటర్ దిగడంతో కలవరపడుతున్నారు. ఇంతకీ ఆ నాయకుడు ఎవరు? ఆయన పోటీ చేస్తున్న లోక్‌సభ నియోజకవర్గం ఎక్కడుంది?
వైస్సార్‌సీపీ ట్రబుల్ షూటర్ విజయసాయి రెడ్ది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చే ఎటువంటి టాస్క్‌ను అయినా.. విజయవంతంగా అమలు చేయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. సైరా విజయసాయిరెడ్డిగా ఆయన అభిమానులు పిలుచుకునే ఈ నాయకుడిని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది. నిన్న మొన్నటి వరకు తమకు తిరుగులేదని భావించిన సింహపురి టీడీపీ నేతలకు సైరా ఎంట్రీతో కలవరం మొదలైంది. నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లోనూ వైస్సార్సీపీ అభ్యర్థుల గెలుపుతో పాటు.. తాను ఎంపీగా గెలిచేలా విజయసాయిరెడ్డికి సీఎం వైఎస్ జగన్ బాధ్యతలు అప్పగించారు.
నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ తన అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసింది. టీడీపీ మాత్రం కొన్ని చోట్ల అభ్యర్థులు లేక..కొన్ని చోట్ల ఎవరికి ఇస్తే..ఎవరికి కోపం వస్తుందో అనే భయంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కొనసాగుతోంది. తొలి జాబితాలో నాలుగు సెగ్మెంట్లలో అభ్యర్థులను ప్రకటించినా.. కోవూరు, ఆత్మకూరు, కందుకూరు స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయలేక సతమతం అవుతోంది. దీంతో అక్కడి క్యాడర్, నేతలు డైలామాలో పడ్డారు. ఇప్పుడు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి పేరు ప్రకటించడంతో టీడీపీ నేతలకు భయం రెట్టింపు అయింది.. ప్రకటించిన అభ్యర్థులను కూడా మార్చే ఆలోచనలో ఉన్నట్లు టీడీపీ నేతల్లో చర్చ మొదలైంది.
విజయసాయి రెడ్డి వేసే ఎత్తులు, పైఎత్తులను తట్టుకోవడం కష్టమని జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు సైతం ఆందోళన చెందుతున్నారట. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఓడించడంతో పాటు.. మొత్తం అన్ని నియోజకవర్గాలో గెలుపే లక్ష్యంగా విజయసాయిరెడ్ది పక్కా ప్రణాళికతో జిల్లాలోకి ఎంటర్ అయ్యారని.. టీడీపీ నేతలను మడత పెట్టడం ఖాయమని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు చెబుతున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్దిని..అలాగే అనం రామ నారాయణ రెడ్డిని ఓడించడం కోసం విజయసాయి రెడ్ది వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారని జిల్లాల్లో టాక్ నడుస్తోంది.
సింహపురి జిల్లాపై మంచి పట్టు ఉన్న విజయసాయి రెడ్ది ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగటంతో టీడీపీ నేతలకు ఏమీ పాలుపోవడంలేదు. జిల్లాలోని అన్ని వర్గాల్లో, టీడీపీ నాయకులతో కూడా విజయసాయిరెడ్డికి విస్తృత సంబంధాలు ఉండటమే టీడీపీ నాయకత్వంలో భయానికి కారణం అంటున్నారు. విజయసాయి రెడ్దితో జాగ్రత్తగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు.. జిల్లా పార్టీ నేతలకు ఇప్పటికే సమాచారం పంపారని తెలుస్తోంది. పార్లమెంట్ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అసంతృప్తితో ఉన్న టీడీపీ నేతలు సైరాకు టచ్ లో ఉన్నారని.. వారు ఏ క్షణమైనా వైఎస్‌ఆర్‌సీపీలోకి జంప్ చేసే అవకాశం ఉందని టీడీపీ నేతలే చెబుతున్నారు.
విజయసాయిరెడ్డి ఇంకా పూర్తిస్థాయిలో బరిలోకి దిగక ముందే టీడీపీ నేతలకు కంటిమీద కునుకు కరువైంది. వైఎస్‌ఆర్‌సీపీలోని నేతల్ని సెట్ రైట్ చెయ్యడంతో పాటు.. టీడీపీలోని కీలక నేతల్ని తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు విజయసాయిరెడ్ది ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఇదే జరిగితే మరోసారి నెల్లూరు జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ క్లిన్ స్వీప్ చేయడం ఖాయమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment