లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పాత భారాన్ని వదిలించుకోవడానికి కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికల్లో 70 శాతం కొత్త ముఖాలను బరిలోకి దించుతోంది. యూపీని మళ్లీ చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో 40 శాతం మహిళలకు అవకాశమన్న తన వాగ్దానానికి కట్టుబడుతూనే... పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. జనవరి 13న 125 మందితో మొదటి జాబితాను, మరో 41 మందితో జనవరి 20 రెండో జాబితాను విడుదల చేశారు. ఇప్పటివరకూ విడుదల చేసిన 166 మంది జాబితాలో 70 శాతం కొత్తవారు ఉండటం గమనార్హం.
వారిలో 119 మంది మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారే. మొదటి జాబితా 125 మందిలో 26 మంది అభ్యర్థులు 35 ఏళ్లలోపువారే కావడం విశేషం. ఉత్తరప్రదేశ్‌లో న్యాయం కోసం పోరాడుతున్న వారికి పార్టీ ఈ ఎన్నికల్లో అవకాశమిస్తోందని, వారిని అధికారంలోకి తీసుకురావడమే తన ధ్యేయమని మొదటిజాబితా విడుదల సందర్భంగా ప్రియాంక చెప్పారు. కొత్తవారికి అవకాశం ఇవ్వడం వల్ల కొత్త శక్తి రావడమే కాదు... పార్టీలో ఇప్పటికే ఉన్న అంతర్గత గొడవలను అధిగమించడానికి ఉపయోగపడుతుందని పార్టీ నేత ఒకరు తెలిపారు.
విభిన్నంగా ఎంపిక...
అభ్యర్థుల ఎంపికలో ప్రియాంక విభిన్నత పాటించారు. మహిళలు, యువత, రైతులు, వెనుకబడిన కులాలు, దళితుల సమస్యల మీద పోరాడే ఉధ్యమకారులకు ప్రాధాన్యమిచ్చారు. సాహిబాబాద్ నియోజకవర్గంలో దివంగత రాజీవ్ త్యాగీ భార్య సంగీత త్యాగీకి అవకాశమిచ్చారు. ఇక ఉన్నావ్ రేప్ బాధితురాలి తల్లి 55ఏళ్ల ఆశాసింగ్‌తోపాటు, సీఏఏ వ్యతిరేక ఉద్యమకారిణి పార్టీ అధికార ప్రతినిధి సదాఫ్ జాపర్, ఆశ వర్కర్ల కోసం ఉద్యమిస్తున్న పూనమ్ పాండే, ఆదివాసీ హక్కులకోసం పోరాడుతున్న రామ్‌రాజ్ గోండ్ వంటివాళ్లందరూ కొత్తగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారే. వీరితోపాటు హాపూర్ నుంచి సామాజిక ఉద్యమకారిణి భావనా వాల్మీకి, చర్తావాల్ నుంచి యాస్మిన్‌రాణా, ఠాకూర్‌ద్వారా నుంచి సల్మా ఆఘా, బిలారీ నుంచి కల్పనా సింగ్, దక్షిణ మీరట్ నుంచి నఫీజ్ సైఫీ, శరణ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్న సుఖ్విందర్ కౌర్ అందరూ మొట్టమొదటిసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. మొహమ్మదీ నుంచి రీతూ సింగ్ తదితరులు మహిళా అభ్యర్థుల జాబితాలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment