సాక్షి, హైదరాబాద్: బీజేపీలో కొత్త నేతలు కుదురుకోని పరిస్థితి కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరినవారు ఎక్కువ కాలం ఉండలేకపోతున్నారని.. దీనికి ఇటీవలి నిష్క్రమణలే సాక్ష్యమని, రాజగోపాల్‌రెడ్డి రాజీనామా తాజా ఉదాహరణ అని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరాక.. జాతీయ కార్యవర్గ సభ్యులుగా, ఇతర ప్రాధాన్య పదవులు ఇచ్చి నా, పార్టీలో ఉండలేకపోవడానికి కారణాలేమిటనే దానిపై ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలో పార్టీని నడిపే తీరులో జాతీయ నాయకత్వం తీరు, అంతా ఢిల్లీ నుంచే నడిపించడం, ఇక్కడి రాజకీయ వాతావరణం, పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటివి అసంతృప్తికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాష్ట్ర నాయకత్వం వ్యవహార శైలి, అనుసరించే వ్యూహాలు అర్థంగాకపోవడం, సమన్వయ లేమి వంటివి కూడా ఇబ్బందికరంగా మారాయని పార్టీ నేతలు అంటున్నారు. పార్టీలో అసంతృప్త నేతలుగా ముద్రపడిన వారంతా ఇతర పార్టీల నుంచి వచ్చినవారేనని, వారు ఇక్కడ ఇమడటం కష్టంగానే ఉందని పేర్కొంటున్నారు.
రాజీనామాల పర్వంలో..
బీజేపీలో ఇటీవల వరుసగా రాజీనామాలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి చంద్రశేఖర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి. కె.స్వామిగౌడ్, మోత్కుపల్లి నర్సింహులు, ఎర్ర శేఖర్, నాగం జనార్దన్‌రెడ్డి ఇప్పటికే పార్టీని వీడగా.. తాజాగా రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. వీరంతా పార్టీలో ఇమడలేక, జాతీయ, రాష్ట్ర నాయకత్వాల వ్యూహాలు అర్థంకాక నిష్క్రమిస్తున్నారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.
దీనికి మరిన్ని కారణాలూ ఉన్నాయని.. వీటిపై పార్టీ నాయకత్వం పెద్దగా సమీక్షించిన దాఖలాలు కూడా లేవని అంటున్నారు. ఇటీవల పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల సందర్భంగా పార్టీ జాతీయ (సంస్థాగత) ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ మాట్లాడుతూ.. ‘‘వచ్చే వాళ్లు వస్తుంటారు.. పోయే వాళ్లు పోతుంటారు..’’ అన్నారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని చెప్తున్నారు.
కీలకమైన అసెంబ్లీ ఎన్నికల తరుణంలో కొత్త నేతల సమస్య మరోసారి రాష్ట్రపార్టీకి తలనొప్పిగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అసంతృప్త నేతలుగా ముద్రపడిన వారిలో ఇంకా ఎవరెవరు పార్టీ మారుతారోనన్న చర్చ జరుగుతోందని అంటున్నాయి.
మాజీ ఎంపీలంతా లోక్‌సభ పోటీ వైపే..
రాష్ట్ర పార్టీలోని ముఖ్య నేతలంతా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశించినా.. మాజీ ఎంపీలు, ఇతర సీనియర్లు లోక్‌సభకు పోటీ చేయడానికే మొగ్గుచూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తొలుత పోటీకి విముఖంగా ఉన్నట్టు వార్తలు వచ్చి నా.. జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. చెన్నూరు సీటుకు జాతీయ కార్యవర్గ సభ్యుడు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ జి.వివేక్ వెంకటస్వామి పేరును ఖరారు చేసినా ఆయన పోటీకి ససేమిరా అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. మాజీ ఎంపీలు ఏపీ జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూరనర్సయ్యగౌడ్ తదితరులు కూడా లోక్‌సభకే పోటీ చేస్తా మని చెప్తున్నారు. ఇక మహబూబ్‌నగర్ నుంచి తాను, షాద్‌నగర్ నుంచి కుమారుడికి అసెంబ్లీ టికెట్లు కోరుతున్న జితేందర్‌రెడ్డి.. ఇప్పుడు స్వరం మార్చి మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగానే పోటీచేస్తానని తాజాగా ప్రకటించారు.
రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడులో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ను పోటీకి నిలిపే అవకాశాలపై చర్చ జరుగుతోంది. కానీ తాను భువనగిరి నుంచే పోటీకి సిద్ధంగా ఉన్నట్టు ఆయన చెప్తున్నారు. అధిష్టానం ఒత్తిడి తెస్తే.. వారు కూడ పార్టీ మారితే పరిస్థితి ఏమిటనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment