పాట్నా: బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. జనవరి 28న బీజేపీ-జేడీయూ నేతృత్వంలో నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మార్పుల నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్‌ను నితీష్ నేడు కలిశారు. జేడీయూ, బీజేపీలు తమ ఎమ్మెల్యేలందర్ని ఇప్పటికే పాట్నాకు పిలిపించాయి. బీజేపీ నేత సుషీల్ కుమార్ మోదీ ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారని సమాచారం.
జేడీయూ,ఆర్జేడీ విభేదాలతో ఆర్జేడీ నేత లాలూ యాదవ్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పరిచే ప్రయత్నంలో పడ్డారు. రాష్ట్రంలో అధికారంలో కొనసాగేందుకు 122 సీట్ల మార్కును చేరుకునేందుకు లాలూ యాదవ్ పావులు కదుపుతున్నారు. మహాకూటమి నుంచి నితీష్ కుమార్ ఉపసంహరించుకున్న సందర్భంలో ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఆర్జేడీకి ఇంకా 8 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతుంది. దీంతో జితన్‌రామ్ మాంఝీ కుమారుడు సంతోష్ మాంఝీని మాహా కూటమిలో చేర్చే ప్రయత్నం చేశారు లాలూ. ఇందుకు సంతోష్ మాంఝీకి లోక్‌సభ స్థానాలతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా ఆఫర్ ఇచ్చారని సమాచారం. ఇందుకు నో చెప్పినట్లు మాంఝీ వెల్లడించారు.
బిహార్‌లో కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీల సహా స్థానిక పార్టీలతో ఏర్పడిన మహాకూటమికి జేడీయూ నేత నితీష్ కుమార్‌కు స్వస్తి పలకనున్నారని రెండు రోజులుగా రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇండియా కూటమి నుంచి పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లో భగవంత్ మాన్ తర్వాత కీలక నేత నితీష్ తప్పుకోనున్నారు. మాహా కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో జతకట్టి మళ్లీ సీఎంగా పదవి చేపట్టనున్నారని సమాచారం. ఈ అనుమానాలను నిజం చేస్తూ అటు.. రాహుల్ చేపట్టే న్యాయ్ యాత్రకు కూడా బిహార్‌లో హాజరుకాబోమని నితీష్ వర్గాలు తెలిపాయి. కర్పూరీ ఠాకూర్‌కి కేంద్రం భారత రత్న ప్రకటించిన అనంతరం జేడీయూ, ఆర్జేడీ మధ్య ఇటీవల విభేదాలు తారాస్థాయికి చేరాయి.
బిహార్లో 2020లో ఏర్పాటైన మహాఘట్‌బంధన్ సంకీర్ణ సర్కారు నిత్యం కలహాలమయంగానే సాగుతూ వస్తోంది. ముఖ్యంగా తేజస్విని సీఎం చేసి తప్పుకోవాలని లాలు కొంతకాలంగా పట్టుబడుతుండటంపై నితీశ్ గుర్రుగా ఉన్నారు. జేడీ(యూ) తాజా మాజీ అధ్యక్షుడు లలన్ సింగ్ సాయంతో ఆ పార్టీ నుంచి డజను మంది ఎమ్మెల్యేలను లాగేసేందుకు లాలు ఇటీవల గట్టి ప్రయత్నమే చేశారు. దాన్ని సకాలంలో పసిగట్టిన నితీశ్ లలన్‌కు ఉద్వాసన పలికి తానే పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు. ఈ ఉదంతంతో ఆర్జేడీతో విభేదాలు తారస్థాయికి చేరాయి. లాలు, నితీశ్‌లిద్దరికీ రాజకీయ గురువైన బిహార్ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్ శత జయంత్యుత్సవాల సందర్భంగా బుధవారం నితీశ్ చేసిన వ్యాఖ్యలు విభేదాలకు మరింతగా ఆజ్యం పోశాయి.
ఇదీ చదవండి: Lok Sabha polls 2024: బీజేపీ వైపు... నితీశ్ చూపు!
Comments
Please login to add a commentAdd a comment