సాక్షి, న్యూడిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరికపై ఇంకా క్లారిటీ రాలేదు. అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన కీలక సమావేశంలో 12మందికిపైగా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. పీకే 2024 రోడ్‌మ్యాప్‌పై సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై విస్తృతస్థాయిలో చర్చించారు. దీంతోపాటు పార్టీ బలోపేతానికి, సమస్యల పరిష్కానికి ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ 2024 అనే కమిటీని సోనియా ఏర్పాటు చేశారు. సోనియా నివాసంలో మూడుగంటలపాటు జరిగిన సమావేశంలో ప్రశాంత్ కిశోర్ ఎంట్రీపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రశాంత్ కిశోర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవాలా వద్దా అనే అంశంపై కాంగ్రెస్ నేతలు సుదీర్ఘంగా చర్చించారు.
ఒకవేళ పార్టీలో చేరితే, ఏం బాధ్యతలు అప్పగించాలనే విషయంపైనా చర్చ జరిగింది. పీకే 2024 రోడ్‌మ్యాప్‌పై మెజార్టీ సభ్యులు సానుకూలంగానే ఉన్నారని సమాచారం. అయితే, ప్రశాంత్ కిశోర్ పార్టీలో చేరాక మరే ఇతర రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయవద్దని, ఎలాంటి సేవలు అందించవద్దని కాంగ్రెస్ సీనియర్లు షరతులు పెట్టారట. దీనిపై తుదినిర్ణయం సోనియాగాంధీదే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిశోర్ ఎంట్రీపై ఇప్పటికే రచ్చ మొదలైంది.
చదవండి👉 పీకే చర్చ మీడియాలో మాత్రమే జరుగుతోంది: భట్టి
రాష్ట్రాల ఇంఛార్జ్‌లుగా ఉన్న కొందరు జనరల్ సెక్రటరీలు పీకే చేరికను వ్యతిరేకిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రధాన కార్యదర్శులపై ప్రశాంత్ కిశోర్ నెగెటివ్ రిపోర్ట్ ఇవ్వడమే దీనికి కారణమని తెలుస్తోంది. రాష్ట్రాల్లో ఇంఛార్జ్‌లుగా ఉన్నవారు కొందరికి అనుకూలంగా పనిచేస్తున్నారని.. దీనివల్ల క్షేత్రస్థాయిలో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని కుండబద్దలు కొట్టారంట పీకే. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ చేసిన ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి. టీ కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిషోర్ టెన్షన్ మొదలైందని దీనిని బట్టి తెలుస్తోంది.
ఇదిలాఉండగా.. మే 13, 14, 15 తేదీల్లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో చింతన్ శిబిరం జరగనుంది. దేశవ్యాప్తంగా 400మంది కాంగ్రెస్ నేతలు ఈ భేటీకి హాజరవుతారు. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు, అధ్యక్ష ఎన్నికలు సహా వివిధ అంశాలపై చింతన్ శిబిరంలో చర్చిస్తారు. చింతన్ శిబిరానికి తేదీలు ఖరారైన నేపథ్యంలో ఈ లోపే పార్టీలో పీకే చేరికపై క్లారిటీ వచ్చేస్తుందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. మరి కాంగ్రెస్ షరతులకు ప్రశాంత్ కిశోర్ అంగీకరిస్తారా..? లేదా అన్నది తెలియాల్సి ఉంది.
చదవండి👉 పీకే టీమ్‌కు ఓకే..
Comments
Please login to add a commentAdd a comment