సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలను రద్దుచేయాలని కేంద్రం నిర్ణయించింది. గతంలో పార్లమెంటు సమావేశాల సందర్భంగా కరోనా ప్రకంపనలు రేపిన నేపథ్యంతోపాటు, దేశంలో ఇంకా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న ఆందోళనల మధ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శీతాకాల పార్లమెంట్ సమావేశాలను రద్దు చేసేందుకు అన్ని పార్టీలు అంగీకరించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దీంతో నేరుగా జనవరిలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించ నున్నట్లు తెలుస్తోంది. సమావేశాలను నిర్వహించాలని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేస్తూ లేఖ రాసిన నేపథ్యంలో మంత్రి ప్రహ్లాద్ జోషి దీనిపై వివరణ ఇచ్చారు. ఈ అంశంపై వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సంప్రదింపులు జరిపామని, సమావేశాలను రద్దు చేయాలని ఏకగ్రీవంగా అందరూ ఆమోదించినట్లు మంత్రి తెలిపారు. మరోవైపు కేంద్ర కేబినెట్ రేపు (బుధవారం) వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశం కానుంది.
కాగా రైతుల ఆందోళన, కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీతో సహా పలు అంశాలపై చర్చించడానికి శీతాకాల సమావేశాలను ఏర్పాటు చేయాలని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ రంజన్ గతంలో స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలపై చర్చించేందుకు శీతాకాల సెషన్‌ను అన్ని కోవిడ్-19 ప్రోటోకాల్‌తో ఏర్పాటు చేయాలని బిర్లాకు రాసిన లేఖలో ఆయన కోరారు. సాధారణంగా నవంబర్ నెలాఖరున లేదా డిసెంబర్ మొదటి వారంలో శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. అలాగే బడ్జెట్ సెషన్ జనవరి చివరి వారంలోనూ ఉంటుంది. ఫిబ్రవరి 1న కేంద్రం ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది.19 మంది లోక్‌సభ ఎంపీలు, ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీలు కరోనా బారిన పడటంతో సెప్టెంబరులో వర్షాకాల సమావేశాలను కుదించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment