భువనేశ్వర్: పూరీ జిల్లాలోని పిప్పిలి అసెంబ్లీ నియోజక వర్గం ఉపఎన్నిక ఏప్రిల్ 17 వ తేదీన నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో రాజకీయ శిబిరాల్లో కొత్త వాతావరణం నెలకొంది. అభ్యర్థుల ఎంపికపై ప్రధాన రాజకీయ పక్షాలు కసరత్తు చేస్తున్నాయి. రాష్ట్ర శాసనసభలో ఈ నియోజక వర్గానికి ప్రత్యేక ఉనికి ఉంది. గతంలో కాంగ్రెస్ ఈ స్థానం నుంచి దీర్ఘకాలం పాటు ప్రాతినిధ్యం వహించగా ఇటీవల అధికార పక్షం బిజూ జనతా దళ్ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది.
బీజేడీ సిట్టింగ్ సభ్యుడు ప్రదీప్త మహారథి అకాల మరణంతో త్వరలో జరగనున్న ఉపఎన్నిక ఈ రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపు అవకాశాల కోసం కాంగ్రెస్, బీజేడీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. పూరీ జిల్లా కేంద్రం నుంచి ఎమ్మెల్యేగా ప్రతిపక్ష బీజేపీ అభ్యర్థి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో పిప్పిలి స్థానం కూడా కైవసం చేసుకోవాలని ఆ పార్టీ ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలో తరచూ బీజేపీ ప్రముఖులు నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు.
ముందంజలో కాంగ్రెస్
పిప్పిలి నియోజక వర్గానికి అభ్యర్థిని ఖరారు చేయడంలో రాష్ట్ర కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఔత్సాహిక అభ్యర్థుల నుంచి గెలుపు గుర్రాల జాబితాను ఖరారు చేసి పార్టీ అధిష్టానం ఆమోదం కోసం సిఫారసు చేసినట్లు ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నిరంజన పట్నాయక్ తెలిపారు. ఈ నెల 30వ తేదీ నాటికి పిప్పిలి నియోజక వర్గం నుంచి పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించడం తథ్యమని ఆయన స్పష్టం చేశారు.
30 మంది ప్రచారకులు
పిప్పిలి ఉపఎన్నికను పురస్కరించుకుని కాంగ్రెస్ ప్రచార సన్నాహాల్ని చేపడుతోంది. జాతీయ, రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకులు ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకుంటారు. ఈ మేరకు 30 మంది ప్రముఖ స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపేందుకు యోచిస్తోంది.
సమీక్ష సమావేశాల్లో బీజేపీ
పిప్పిలి నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థిని ఖరారు చేయడంలో భారతీయ జనతా పార్టీ తలమునకలై ఉంది. పార్టీ ప్రముఖులు డాక్టర్ సంబిత్ పాత్రో, పృథ్వీరాజ్ హరిచందన్, గోలక్ మహా పాత్రోలు అభ్యర్థిని ఖరారు చేయడంలో సమీక్షిస్తున్నారు.
సానుభూతి వైపు మొగ్గు
అధికార పక్షం బిజూ జనతా దళ్ సానుభూతి సూత్రంతో పిప్పిలి నియోజక వర్గం నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దివంగత నాయకుడు ప్రదీప్త మహారథి కుటుంబీకుల నుంచి ఒకరికి టికెట్ కట్టబెట్టి నియోజక వర్గం ఓటర్ల సానుభూతితో గట్టెక్కే యోచనలో ఉంది. కాంగ్రెస్, బీజేపీల వ్యూహం బెడిసి కొట్టాలంటే ఇంతకంటే బీజేడీకి ఇంతకంటే అనుకూలమైన మార్గం మరొకటి లేనట్లు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రదీప్త మహారథి భార్య, ఆయన కుమారుడు పిప్పిలి నుంచి అధికార పక్షం బిజూ జనతా దళ్ నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలించి ఒకరికి టికెట్ లభించడం తథ్యమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
చదవండి: అడవి పంపిన బిడ్డ
Comments
Please login to add a commentAdd a comment