
పొద్దున్నే లేవగానే వీధుల్లోకి మైకేసుకుని రిక్షాలో వస్తుంటారు ఇలాంటి వాళ్ళు.. పెద్ద సౌండ్ చేస్తూ పాత కుర్చీలు.. వాడని సైకిళ్ళు.. ప్లాస్టిక్ బకెట్లు కొంటాం.. ఉల్లిపాయలు ఇస్తాం అంటుంటారు.. అంటే ఈ సామాన్లు సదరు కాలనీవాసులకు పనికిరాదు కానీ ఆ వ్యాపారికి మాత్రం లాభసాటి అన్నమాట.. తడిచెత్త.. పొడిచెత్త మనకు పనికిరాదు కానీ దాంతో విద్యుత్ తయారు చేసేవాళ్లకు మాత్రం అదే బంగారం. తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి సైతం అలాగే మారింది.
గత కొన్నాళ్లుగా.. క్షయ రోగి మాదిరిగా క్షీణిస్తూ వస్తున్న తెలుగుదేశం నుంచి బయటకు వచ్చేవాళ్లే తప్ప కొత్తగా చేరేవాళ్ళు కానరావడం లేదు. దీంతో ఏ మొక్కా లేనిచోట ఆముదం మొక్కే మహావృక్షం అయినట్లుగా.. ప్రజలు పూర్తిగా మరచిపోయిన, ప్రజాదరణ లేని కొందరిని తెలుగుదేశంలో చేర్చుకుని అదే మహాప్రసాదంగా భవిస్తూ సంబరపడిపోతున్నారు. దాంతోబాటు తెలుగుదేశం మద్దతుదారు అయిన పచ్చ మీడియా సైతం తెలుగుదేశం బలపడుతోందంటూ ఊదరగొడుతున్నారు.
►వాస్తవానికి నిన్న టీడీపీలో చేరినవాళ్లలో ద్వారకానాథ రెడ్డి 1994లో ఆయన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో పాటు లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం రద్దు కావడంతో ద్వారకానాథరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. 2009లో టికెట్ దక్కలేదు. వైఎస్ జగన్ వైఎస్సార్‌సీపీని స్థాపించిన తర్వాత 2014లో టికెట్ ఆశించగా దక్కలేదు. అయినప్పటికీ నిరాశ చెందకుండా 2019లో వైఎస్సార్‌సీపీ, టీడీపీల నుంచి టికెట్ కోసం ప్రయత్నించారు. అనంతరం రాజకీయాలకు దూరంగా వుంటూ వచ్చారు. ఇప్పుడు అయన టీడీపీలో చేరడం.. దాన్ని చూసి సంబరపడిపోవడం చూస్తుందే.
►ఇక సి.రామచంద్రయ్య అయితే ఎన్నడూ ప్రజల నుంచి గెలవలేదు.. టీడీపీ.. కాంగ్రెస్.. ప్రజారాజ్యం అన్ని పార్టీలూ చూసేసారు.. అయన మేధావి అని చెప్పుకుంటూ ఇన్నాళ్లూ పబ్బం గడిపేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరాక ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. అయినా ఇప్పుడు తాజాగా టీడీపీలో చేరారు. అయన ఉనికి కూడా కడప జిల్లావాసులకు తెలియదు.
►1999లో అనకాపల్లి నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దాడి వీరభద్ర రావు సైతం గత ఇరవయ్యేళ్లులో గెలిచింది లేదు. ప్రజలకు దూరంగానే ఉంటున్నారు. ఆయన్ను చేర్చుకోవడం మహా ఘనత అని తెలుగుదేశం చెప్పుకుంటోంది.
►ఇది కాకుండా కడప జిల్లాకు చెందిన డీ.ఎల్ రవీంద్ర రెడ్డి, వీర శివారెడ్డి సైతం టీడీపీవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. వీరు కూడా దాదాపు రిటైర్ అయినట్లే.. ప్రజలకు దూరమై చాన్నాళ్లు ఐంది. కానీ ఎవరో ఒకరు వచ్చారు కదా అన్నట్లుగా టీడీపీ సంబరపడుతోంది.
✍️:::సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment