సాక్షి, ముంబై: మంత్రాలయలో విధులు నిర్వహిస్తున్న ఆయా శాఖల కార్యదర్శులకు మంత్రుల అధికారాలు అప్పగించడంపై మహా వికాస్ అఘాడీకి చెందిన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరి నెల మీద వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడంవల్లే నేడు శిందే, ఫడ్నవీస్ ప్రభుత్వానికి ఈ దుస్థితి ఎదురైందని మహా వికాస్ అఘాడీ నేతలు దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు సీఎం శిందే సమాధానమిస్తూ కార్యదర్శులకు మంత్రుల అధికారాలు కొన్ని మాత్రమే తాత్కాలికంగా కట్టబెట్టామే తప్ప, మిగతా అధికారాలు మంత్రిమండలి వద్దే ఉంటాయని స్పష్టం చేశారు.
మంత్రులు లేక వివిధ శాఖల్లో పనులు స్థంభించిపోతున్నాయన్నారు. దీంతో పనులు పారదర్శకంగా, వెంటనే పూర్తయ్యేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై శిందే దృష్టి సారించారు. అందులో భాగంగా మంత్రాలయలో ఆయా శాఖల్లో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శులకు శనివారం తాత్కాలికంగా మంత్రుల బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. కానీ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మహావికాస్ అఘాడీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ చేపట్టాలంటే బీజేపీ ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదు. శిందే, ఫడ్నవీస్ అసమర్థతవల్ల మంత్రివర్గ విస్తరణ తరుచూ వాయిదా పడుతోందని ఆరోపించారు.
శిందే తరుచూ ఢిల్లీ పర్యటన చేస్తూ అక్కడ బీజేపీ అధిష్టానంతో మంతనాలు జరుపుతూ కాలం వెల్లదీస్తున్నారు. రాష్ట్రంలో మంత్రులు లేకపోవడంవల్ల ప్రజల పనులు సకాలంలో జరగడం లేదు. దేవేంద్ర ఫడ్నవీస్ వద్ద కూడా ఎలాంటి శాఖలు లేవు. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన హోంశాఖ మంత్రి పదవి ఖాళీగానే ఉంది. ఫలితంగా ప్రభుత్వ పాలన కుంటుపడుతోంది. హోం, రెవెన్యూ, నగరాభివృద్ధి, ఆహార, పౌర, సరఫరాల శాఖ, ఫుడ్ అండ్ డ్రగ్స్ పరిపాలన విభాగం, గ్రామాభివృద్ధి, విద్య తదితర శాఖలతో సామాన్య ప్రజలకు చాలా దగ్గరి సంబంధాలుంటాయి. ప్రస్తుతం మంత్రివర్గంలో ఇద్దరే ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్న శిందే, ఫడ్నవీస్ తీసుకుంటున్నారు.
చదవండి: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంశాఖ?
మంత్రులు లేకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగానే ఉంటున్నాయని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు అనేక చోట్ల వరదలొచ్చాయి. బయట ప్రపంచంతో సబం«ధాలు తెగిపోయాయి. మంత్రులు లేక వరద బాధితులకు సాయం, పునరావాసం, పంటల నష్టంపై పంచనామా వంటి పనులు సకాలంలో పూర్తికాలేక పెండింగ్‌లో ఉన్నాయి. కానీ మంత్రుల అధికారాలు కార్యదర్శులకు అప్పగిస్తే తప్ప ఈ పనులు పారదర్శకంగా పూర్తికావని దుయ్యబట్టారు. ముఖ్యంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రులు లేకపోవడంతో బాధితుల గోడు వినే నాథుడే కరువయ్యాడు. డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ చదివి పరీక్షలు రాసిన కార్యదర్శులకు ఈ విషయాలు ఎలా తెలుస్తాయని నిలదీశారు. ప్రజలతో ఉంటూ, ప్రజల్లో మమేకమై తిరిగి, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకు అంటే మంత్రులకే ఎక్కువ తెలుస్తుందన్నారు. దీంతో త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment