
సాక్షి, హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలు అంశంపై బీజేపీకి కనీస అవగాహన లేదని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆ పార్టీ ధర్నాలు చేస్తోందని విమర్శించారు. గురువారం బీజేపీ నిర్వహించిన ధర్నాలో రైతుల వేషంలో ఉన్న బీజేపీ కార్యకర్తలే పాల్గొన్నారన్నారు. పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నేతలు మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సోమ భరత్‌కుమార్ గుప్తాతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,550 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచినా బీజేపీ నాయకులు సోయి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వానాకాలం పంట కొనుగోలుకు సంబంధించి ఇప్పటి వరకు రూ.వెయ్యి కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. కనీస జ్ఞానం లేని వ్యక్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావడం దురదృష్టకరమన్నారు. తెలంగాణలో పండించే వరి ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ నేతలు ఢిల్లీలో ధర్నాలు చేయాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి సూచించారు.
ఇతర రాష్ట్రాల్లో రైతులు తమ దిగుబడులను అమ్ముకునేందుకు బహిరంగ మార్కెట్లకు వెళ్లారని, కానీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతుల ముగింట్లోకి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేసిందీ లేనిదీ.. కేంద్ర ప్రభుత్వం నుంచి బండి సంజయ్ తెలుసుకోవాలన్నారు. అబద్ధాలతో కొనసాగుతున్న బీజేపీ రాజకీయ ప్రస్థానం రాష్ట్రంలో ఎక్కువ కాలం కొనసాగదని పల్లా అన్నారు. ధర్నా చౌక్‌ను రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఎత్తివేయలేదని.. స్థానికుల ఫిర్యాదు మేరకే ఆ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment