సాక్షి, న్యూఢిల్లీ: జూలై 19(సోమవారం) నుంచి 17వ లోక్‌సభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశాలలో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలని కేంద్రం విపక్షాలను కోరనుంది. మొత్తం 19 రోజులు సమావేశాలు జరగనున్నాయి.
కరోనా థర్డ్‌వేవ్ భయాల నేపథ్యంలో జరగనున్న ఈ సమావేశాలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. కేంద్ర మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ తరువాత వచ్చిన తొలి సమావేశాలు ఇవే. అలా పలువురు కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించాక సభలో ప్రతిపక్షాలను తొలిసారి ఎదుర్కోవాల్సి వస్తోంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన ప్రాంతీయ పార్టీల చేతిలో బీజేపీ ఓటమి పాలయ్యాక జరుగుతున్న తొలి పార్లమెంట్ సమావేశాలూ ఇవే. అలా ఈ ఏడాది జరగనున్న వర్షాకాల సమావేశాలకు ప్రాధాన్యం ఉంది. ప్రభుత్వం తన అజెండాను ముందుకు తీసుకురావాలనీ, ప్రతిపక్షాలు తమ వాణిని వినిపించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనీ ప్రయత్నించే వేళ... మొత్తం 19 రోజులు పార్లమెంట్ సమావేశం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment