బాబూ.. ఐ లవ్యూ | Pawan has no idea of becoming CM | Sakshi
Sakshi News home page

బాబూ.. ఐ లవ్యూ

Published Mon, May 1 2023 4:26 AM | Last Updated on Mon, May 1 2023 9:28 AM

Pawan has no idea of becoming CM - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అధికారంలోకి రావాలనిగానీ, ముఖ్యమంత్రి అవ్వాలనిగానీ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు ఏకోశానా లేదు. రాజకీయంగా బలపడటానికి అవకాశం ఉన్నా.. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బలహీనమైతేనే రాజకీయంగా కనీసం తమ ఉనికి అయినా ఉంటుందని, ఈ విషయం సాధారణ కార్యకర్తను అడిగినా చెబుతారు.

కానీ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఈ విషయం తెలియనట్లే వ్యవహరిస్తున్నారు. ఈ నేతలిద్దరికీ చంద్రబాబును సీఎంను చేయాలనే తపన తప్ప మరో ఉద్దేశం కనిపించడంలేదు. ఎదగడానికి ఉన్న అవకాశాలను పట్టించుకోకుండా చంద్రబాబుతో పవన్‌ సమావేశం కావడం, మరిన్ని భేటీలుంటాయని నాదెండ్ల చెప్పటం చూస్తే.. నమ్ముకున్న నాయకుల్ని, కార్యకర్తల్ని మీదారి మీరు చూసుకోండని చెప్పినట్లే ఉంది.

కేవలం వాళ్లిద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నికై చంద్రబాబు సీఎం అయితే చాలని వారు భావిస్తున్నట్లు ఉంది. తాజాగా జనసేన అధినేత తీరుపై అభిమానుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. చంద్రబాబూ.. ఐ లవ్యూ.. అంటూ ఆయన ఇంటికెళ్లి పుష్పగుచ్ఛం ఇచ్చి మీ గెలుపు బాధ్యత నాదే అంటూ భరోసా ఇచ్చి రావడం తమకు తీవ్ర అవమానంగా ఉందని జనసేన నేతలు, కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. 

సొంత పార్టీ కోసం కాదు.. టీడీపీ కోసమే.. 
అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉన్నా, ఇప్పటికీ రెండు మూడు నెలలకొకసారిగానీ రాష్ట్రానికి రాని పవన్‌కళ్యాణ్‌ ఇటీవల కాలంలో వెంటవెంటనే మూడుసార్లు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి ఏ మాత్రం ఇష్టం లేని బీజేపీని సైతం ఒప్పించేలా పవన్‌కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌ కార్యక్రమాలు సాగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే పవన్‌  సొంత పార్టీ కంటే తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని అభిమానులు పేర్కొంటున్నారు. 

పవన్‌ సీఎం కావాలంటే టీడీపీ నేతలే కించపరిచారు  
పవన్‌కళ్యాణ్‌ సీఎం కావాలని తాము డిమాండ్‌ చేసిన సందర్భాల్లో తెలుగుదేశం అధికారిక సోషల్‌ మీడియా, ఆ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరకరంగా స్పందించినట్లు జనసేన నేతలు గుర్తు చేసుకుంటున్నారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నా ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్‌ ఉండాలని జనసేన నాయకులు డిమాండ్‌ చేసినప్పుడు టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి ‘క్వింటా కాటా తూగడానికి ఒక్కొక్కసారి కొన్ని వడ్లు అవసరమవుతాయి.

కానీ, ఆ కొన్ని వడ్ల వల్లే మొత్తం కాటా తూగింది అనుకుంటే ఎలా సేనాధిపతీ!’ అంటూ జనసేన అధినేతను కించపరుస్తూ  ట్వీట్‌ను చేశారని గుర్తుచేస్తున్నారు. రాష్ట్రంలో జనసేనను రాజకీయంగా బలహీనపరచడానికి అధికార వైఎస్సార్‌సీపీ మాదిరే తెలుగుదేశం పార్టీ కూడా ప్రయత్నం చేస్తోందని కాపు సంక్షేమసేన తరఫున మాజీ మంత్రి హరిరామజోగయ్య వంటి నేతలు ఇటీవల పవన్‌కళ్యాణ్‌తో జరిగిన భేటీలో చెప్పిన సంగతి తెలిసిందే.

వైఎస్సార్‌సీపీని గద్దె దింపడానికి విపక్షాలన్నీ కలవాలని చెబుతూనే చంద్రబాబు.. జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, మహాసేన రాజేష్‌లాంటి వారిని తెలుగుదేశంలో చేర్చుకున్నారని హరిరామజోగయ్య నేరుగా పవన్‌కళ్యాణ్‌ వద్దే ప్రస్తావించారు.  

చంద్రబాబును నమ్మి బాగుపడ్డవారు లేరు 
తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న పార్టీలు గానీ, చంద్రబాబును నమ్మినవారుగానీ రాజకీయంగా ఎదిగి న చరిత్ర లేదని పవన్‌ అభిమానులు గుర్తుచేస్తున్నారు. అలాంటి చరిత్ర ఉన్న చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌ రాజకీయ ఎదుగుదల కోసం మరొకరిని రాజకీయ సమాధి చేయడానికే చూస్తారనేది తెలిసినా పవన్‌ ఇలా వ్యవహరిస్తుండటం చూ స్తే ఆయనకు ఎదగాలని లేదని అర్థమవుతోందని పేర్కొంటున్నారు.  పొత్తుల్లో జనసేనకు ఇచ్చే సీట్ల సంఖ్య నామమాత్రంగానే ఉండే అవకాశం ఉండొచ్చని అభిమానులే అంటున్నారు.

2014 ఎన్నికల సమయంలో 15 సీట్లు బీజేపీకి కేటాయించిన టీడీపీ.. అందులో నా లుగుచోట్ల ఫ్రెండ్లీ పోటీ అంటూ అభ్యర్థుల్ని నిలబెట్టిందని, మరో మూడుచోట్ల టీడీపీ నేతలే ఇండిపెండెంట్లుగా పోటీచేశారని జనసేన నేతలు గుర్తుచేసుకుంటున్నారు. ఎప్పుడైనా టీడీపీ వ్యవహారం అలాగే ఉంటుందని చెబుతున్నారు. టీడీపీ నేతల్నే జనసేనలో చేర్పించి పోటీచేయిస్తారని అనుమానిస్తున్నారు. ఇక మనదారి మనం చూసుకోవాలి్సందేనా అని జనసేన నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement