పొత్తు ఎవరితో ఉంటుందో ఇప్పటి వరకు క్లారిటీ లేదని ఆయనే చెబుతున్నారు. ప్రజల మద్దతు తనకు ఉంటుందో లేదో అన్న డైలమాని ఆయనే బయట పెట్టుకున్నారు. ఎవరితో పొత్తులు పెట్టుకుంటే జనసేనకి ఎన్ని సీట్లు కేటాయిస్తోరో ఇంత వరకు క్లారిటీయే రాలేదు. కానీ తాను మాత్రం ముఖ్యమంత్రి సీటుపై కూర్చోడానికి రెడీ అంటున్నారు పవన్ కళ్యాణ్. లెక్కలేనంత తిక్క.. తలతిక్కను మించిన కన్ఫ్యూజన్‌ను అణువణువునా నింపుకున్న పవన్ కల్యాణ్ అసలు ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్ధం అవుతోందా? అని రాజకీయ విశ్లేషకులు నిలదీస్తున్నారు.
గోదావరి జిల్లాల తర్వాత విశాఖలో వారాహి యాత్ర ముగించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనలో ఉన్న అయోమయాన్ని బయట పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసే పరిస్థితిలో లేని టీడీపీతో కానీ.. లేదంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కానీ జనసేన పొత్తు పెట్టుకునే అవకాశం కచ్చితంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్.
పొత్తులు అయితే గ్యారంటీగా ఉంటాయి కానీ.. అది బీజేపీతో ఉంటుందా? లేక టీడీపీతో ఉంటుందా? అన్న అంశాలపై చర్చ నడుస్తోందన్నారు పవన్. అంటే ఎవరితో పొత్తు ఉంటుందో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదన్నట్లే అంటున్నారు రాజకీయ పండితులు. సరే పొత్తులు బీజేపీ, టీడీపీల్లో ఏదో ఒక పార్టీతో ఉంటాయా లేదంటే 2014 తరహాలో మళ్లీ మూడు పార్టీలు కలిసి జట్టు కడతాయా? అన్నదాంట్లోనూ క్లారిటీ లేదు.
ఒక వేళ టీడీపీతో కానీ బీజేపీతో కాని పొత్తులు పెట్టుకుంటే అపుడు ఆ పార్టీలు జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తాయి? అన్నదానిపై క్లారిటీ లేదు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఓ పాతిక సీట్లు జనసేనకు ఇవ్వచ్చని ప్రచారం జరుగుతోంది. మరీ ఎక్కువ అనుకుంటే 40 స్థానాల దాకా ఇవ్వచ్చు. ఒక వేళ జనసేనకి 40 స్థానాలు కేటాయిస్తే ఆ 40 నియోజక వర్గాల్లోనూ జనసేన అభ్యర్ధులను బరిలోకి దింపితే పవన్ కళ్యాణ్ పార్టీ ఎన్నింట్లో విజయాలు సాధించే అవకాశాలుంటాయన్నది ప్రశ్న. గత ఎన్నికల్లో జనసేన గెలుచుకున్నది ఏక్ నిరంజన్ లా ఒకే ఒక్క సీటు.
జనసేన ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఆ జోడీ మొత్తానికి 88 స్థానాలు దక్కితేనే మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోగలుగుతాయి. కానీ క్షేత్ర స్థాయిలో జనసేనతో టీడీపీ కలిసినా బీజేపీ కలిసినా ఈ ఫిగర్‌కు దరిదాపుల్లో కూడా స్థానాలు దక్కే పరిస్థితి లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
చదవండి: బాబూ.. కాస్త ప్రధాని మోదీని చాలెంజ్ చేయొచ్చుగా!
అయితే పవన్ కళ్యాణ్ మాత్రం రాబోయేది మిశ్రమ ప్రభుత్వం అంటున్నారు. అంతే కాదు తాను ఈ సారి సీఎం సీటు ఎక్కడానికి రెడీ అంటున్నారు. అయితే దానికి ప్రజలు బలంగా తనకు మద్దతు తెలపాలంటున్నారు పవన్. దీని మీదనే సోషల్ మీడియాలో పవన్‌ను బాగా ట్రోల్ చేస్తున్నారు. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు అమితాబ్ బచ్చన్న అన్నట్లు పవన్ కళ్యాణ్ పార్టీకి కానీ పొత్తు పెట్టుకోబోయే పార్టీకి కానీ, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమయ్యే సీట్లు వస్తాయన్న గ్యారంటీయే ప్రస్తుతానికి లేదు. కానీ పవన్ మాత్రం సీఎం సీటుకు తాను రెడీ అంటున్నారు.
సీఎం సీటులో కూర్చోడానికి పవన్ రెడీ కావచ్చు. కానీ రెడీగా ఉండాల్సింది సీఎం సీటు కదా? సీఎం సీటు రెడీగా ఉండాలంటే అసలు పవన్‌ని సీఎంగా చేయడానికి ప్రజలు రెడీగా ఉండాలి కదా? ఆ ప్రజలే పవన్‌ను సీఎంగా చేయడానికి రెడీగా ఉండే పరిస్థితులు ఉంటే అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవలసిన అగత్యం ఎందుకొస్తుంది? తాను అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోతున్నానన్న దౌర్బల్య పరిస్థితిలోనే కదా పవన్ పొత్తుల కోసం పరితపిస్తున్నది.
పొత్తులు లేనిదే తాను పోటీచేయలేనని చెప్పుకోడానికి నామోషీ అయ్యే కదా వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వననే సవాల్ విసిరినట్లు పవన్ నటించింది? తన వైఫల్యలపై కూడా పవన్ కళ్యాణ్ మంచి కామెడీ చేస్తుంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ గందరగోళంలోనే తనకున్న కన్ఫ్యూజన్ ని పవన్ అందరికీ పంచిపెడుతున్నారని వారు సెటైర్లు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment