
సాక్షి, విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన పార్టీ క్రియాశీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు అవాక్కయ్యే విధంగా కామెంట్స్ చేశారు పవన్. జనసేన టిక్కెట్ల కోసం డబ్బులిచ్చినవారికి నేను బాధ్యుడిని కాదని పవన్ స్పష్టం చేశారు. మోసపోతే అందుకు మీరే బాధ్యులని ట్విస్ట్ ఇచ్చారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో తాజా పరిణామాలతో ముందస్తు ఎన్నికలు రావొచ్చని అనిపిస్తుంది. ఎన్నికల ఏడాదిలో అడుగుపెడుతున్నాం. జనసేన నేతలకు త్యాగం, బాధ్యత, జవాబుదారీతనం ఉండాలి. కేవలం నా చుట్టూ తిరిగితే మీరు నాయకులు అయిపోరు. నేను నటుడిని కావడం ఒక బలం.. అలాగే, ఒక బరువు కూడా. డబ్బులు తీసుకుని జనసేనలో పార్టీ టికెట్లు ఇవ్వరు. ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోతే మీరే బాధ్యులు’ అని తెలిపారు.
పవన్ మాట్లాడిన వేర్వేరు అంశాలపై..
బీజేపీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు..
బీజేపీ నేతల్ని పోలీసులు కొడితే నేను ఖండించా, మా నేతల్ని ఇబ్బందిపెడుతుంటే బీజేపీ రాష్ట్ర నేతలు మాట్లాడటం లేదు.
ఏపీలో రాజకీయ పరిస్థితి..
ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది, ఈ ఎన్నికలు 2019లా ఉండవు. వచ్చే ఎన్నికలపై సర్వేలు చేయిస్తున్నాను.
ముఖ్యమంత్రి ఎవరు అవుతారంటే..
పాదయాత్ర చేసిన వాళ్లు ముఖ్యమంత్రులు అవ్వరు, ప్రాథమిక హక్కులను కాపాడే వ్యక్తులకే సీఎం స్థానం వరించవచ్చు, నేను రూములో కూర్చొని సమస్యలపై అధ్యయనం చేస్తుంటా,
నేను ఆంధ్రకు ఎందుకు మకాం మార్చానంటే..
ఏపీ అభివృద్ధి తెలంగాణకు చాలా అవసరం. తెలంగాణ యువతకు ఉపాధి రావాలంటే ఏపీలో అభివృద్ధి జరగాలి. అందుకే ఆంధ్రకు పూర్తిగా మాకాం మార్చాను. నేను త్యాగాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను.
వాలంటీర్ వ్యవస్థ గురించి
2 ఏళ్లుగా అధ్యయనం చేస్తున్నా - అధ్యయనం చేయడం వల్లే మాట్లాడగలిగాను .రాష్ట్రంలో చిన్న పిల్లలు, మహిళ ట్రాఫికింగ్ జరుగుతోంది.
రాజకీయాల గురించి
రాజకీయాలు చేసేందుకు ఖర్చు పెట్టాలి, కొత్తవాళ్లు పార్టీలోకి వస్తుంటే మనస్పూర్తిగా ఆహ్వానించండి, ఎవరూ రావద్దనే ఆలోచన ధోరణి మానుకోవాలి, అన్ని రకాలుగా నిలబడే నాయకులు వస్తే చేర్చుకుంటాం.