క్రమశిక్షణలేని తన కార్యకర్తల వల్లే తాను ఓడిపోయానంటాడు..
ఓసారి పొత్తుగా ముందుకు వెళ్దామంటూ ప్రతిపక్షాలను బతిమాలతాడు..
ఓసారేమో ఏకంగా సీఎం అవుతా అంటాడు.. మరోసారి ‘అది రాసిపెట్టి ఉండాలని’ అంటాడు
ఓసారి ప్రాణహాని ఉందంటాడు..
ఓసారి ఎమ్మెల్యేగా తనను గెలవకుండా ఎవరు ఆపుతారో చూస్తానంటాడు..
కానీ.. సంక్షేమం ఉసెత్తకుండా ప్రతీసారీ ప్రభుత్వాన్నే విమర్శిస్తాడు..
గత ప్రభుత్వ పాలన గురించి మాత్రం పన్నెత్తి మాట్లాడడు.
తాజాగా జనసేనాని ఖాతాలో మరో స్టేట్‌మెంట్ వచ్చి చేరింది..
ఎమ్మెల్యేగా గెలవనని తెలిసే ఎన్నికలకు వెళ్తానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు..
ఏందో ఈ పవనాలది పూటకో మాట.. రోజుకో వేషం..
సాక్షి, అమలాపురం/ముమ్మిడివరం: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. ఈ నాలుగేళ్లలో ప్రజలకు ఏం చేయలేదా?. ఉద్దేశపూర్వకంగానే సంక్షేమాల గురించి జనసేనాని మాట్లాడడం లేదా?.. తానేం చేస్తాననే విషయం చెప్పకుండా.. ప్రజలను అడిగే తీరులో ఓటు అడగకుండా.. పవన్ వ్యవహరించే తీరు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. కేవలం ఎవరితోనో చేస్తున్న తిట్టి పోతల ఒప్పందంలో భాగంగానే పవన్ అలా వ్యవహరిస్తున్నాడనే అనుమానాలు రాకమానవు.
‘‘వచ్చే ఎన్నికల్లో ఓడిపోయినా.. నిలబడి ఉండటానికి సిద్ధపడి గొడవ పెట్టుకుంటున్నాను. మా నాన్న చెప్పేవాడు.. కీడెంచి మేలెంచమని. నేను ఇంకొకసారి ఓడిపోతానని నిర్ణయించుకున్నారు. అందుకే గొడవ పెట్టుకుంటున్నాను. జనసేన గెలవకపోయినా.. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. ప్రశ్నించడమే నా నైజం. వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా ఉండి.. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లలేకపోతే గనుక మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే వస్తుంది’’ అని వారాహి విజయ యాత్రలో భాగంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరంలో బుధవారం రాత్రి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మాటలివి. ఒకదానికొకటి పొంతన లేకుండా పవన్ ఇచ్చే స్టేట్‌మెంట్‌లలోకి ఇదీ వచ్చి చేరింది ఇప్పుడు..
పవన్ తన యాత్రలో మాట్లాడినవన్నీ పరిశీలిస్తే.. ఎక్కడైనా ప్రజలకు తాను ఏం చేయాలనుకున్నది పవన్ చెప్పాడా?.. పోనీ.. ప్రభుత్వానికి ఇంకా ఏం మంచి చేయాలో సూచించాడా?.. వెళ్లిన ప్రతీచోటల్లా నిజయోకవర్గాల పరిధిలో అభివృద్ధి అనేది లేదని మాట్లాడినట్లుంది ఆయన ప్రసంగం. పైగా అక్కడి నేతలంతా అవినీతిపరులేనని చెడామడా స్టేట్‌మెంట్లు ఇచ్చేస్తున్నాడు. ప్రశ్నించి తీరతానంటున్న పవన్.. ఆ ప్రశ్నలు కూడా సహేతుకంగా ఉండాలనే విషయం మరిచిపోయి ప్రవర్తిస్తున్నాడు. బాబు స్క్రిప్ట్ వల్ల.. దానికితోడు ఓటమి భయం వల్ల పవన్ అలాంటి ప్రకటనలు ఇస్తున్నాడనుకుందాం.
పోనీ.. తన పార్టీ అక్కడ గెలిస్తే ఏం చేస్తాడో చెప్తున్నాడా?(స్పష్టంగా..). ప్చ్.. కేవలం ప్రభుత్వం మీద పడి ఏడవడం, తాటతీస్తా.. తొక్కినారాతీస్తా.. ఛీరేస్తా.. అంటూ వీధికెక్కి మరీ వైఎస్సార్‌సీపీ నేతలను తిట్టిపోయడం.. విమర్శల కంకణం కట్టుకున్న పవన్.. తాను అనుకున్నది చేసుకుంటూ పోతున్నాడు. జనసేనాని జాగ్రత్త.. ఇదంతా జనం గమనిస్తూనే ఉన్నారు!.
ఇదీ చదవండి: నాన్నోరు.. మన మేనిఫెస్టో మళ్లీ చెత్తబుట్టకేనా?
Comments
Please login to add a commentAdd a comment