సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో చురుగ్గా పర్యటనలు చేస్తున్నారు. అయితే ఆయన సభలకు ప్రజల నుంచి స్పందన ఉండటం లేదు. మద్యం, డబ్బు, ఇతర తాయిలాలు ఎరవేసినా పెద్దగా జనం రాకపోయేసరికి చంద్రబాబు టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అందులోనూ జనం ఎక్కువ ఉండేలా కనిపించడానికి ఇరుకిరుకు సందుల్లో సభలు పెడుతున్నారు. ‘కిక్కిరిసిన జన సందోహం’ అనే బిల్డప్ ఇద్దామనుకుంటున్న పచ్చ మీడియా ప్రణాళికలు ఫలించడం లేదు. ఆ ఇరుకు సందులు కూడా జనం లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో చంద్రబాబు టీడీపీ నేతలపై మండిపడ్డట్టు తెలిసింది.
ఇదేం ఖర్మ.. జనం రాకపోయే..
తాజాగా పల్నాడు జిల్లా పెదకూరపాడు, సత్తెనపల్లిల్లో చంద్రబాబు సభలు జనం లేక అట్టర్‌ప్లాప్‌గా నిలిచాయి. దీంతో టీడీపీ శ్రేణుల్లో మనకు ‘ఇదేం ఖర్మ.. జనం రాకపోయే’ అనే నిర్వేదం అలముకుంది. ఇది కాస్తా చంద్రబాబు ఆగ్రహానికి కారణమైతే.. తెలుగు తమ్ముళ్లకు ఆవేదనను మిగిల్చింది. ఎప్పటి మాదిరిగానే జనం తక్కువగా వచ్చినా నిండుగా కనిపించేలా పెదకూరపాడులో చిన్న ప్రాంతాన్ని సభకు ఎంపిక చేసుకున్నారు. అయినా ఆ చిన్న ప్రాంతం కూడా నిండేంతగా జనం రాకపోవడంతో చంద్రబాబు నేతలపై చిర్రుబుర్రులాడినట్టు సమాచారం.
అదే మాదిరిగా సత్తెనపల్లిలోనూ జనం రాకపోవడంతో ముందుగా అనుకున్న షెడ్యూల్‌కు గంటన్నర ఆలస్యంగా చంద్రబాబు సభకు చేరుకున్నారు. పల్నాడులో తమకు ఆదరణ పెరిగిందని చూపించుకునేలా సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ కోసం టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మహిళలకు ఒక చీర, రూ.300, పురుషులకు రూ.500, మద్యం, పలావ్ ప్యాకెట్లు ఇచ్చి జనాన్ని తరలించినప్పటికీ నిర్దేశించుకున్న చిన్న ప్రాంతం కూడా నిండకపోవడం గమనార్హం.
చంద్రబాబు రోడ్ షో సైతం వెలవెలబోయింది. దీంతో పెదకూరపాడు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మాలపాటి శ్రీధర్, సత్తెనపల్లి నేతలకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్టు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. సభలు, రోడ్డు షోలకు జన సమీకరణలో విఫలమైతే ఎలా? అంటూ బాబు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎవరికి వారే బాధ్యత తీసుకోవాలని, గ్రూపులు, గొడవలు ఉంటే పక్కన పెట్టాలని, సభ, రోడ్ షోలకు జనం లేకపోతే ప్రజల్లో వేరే సంకేతాలు వెళ్తాయని చంద్రబాబు మండిపడ్డట్టు తెలిసింది.
తాము డబ్బు, తాయిలాలు ఇచ్చినా పెద్దగా జనం రాలేదని నేతలు వివరణ ఇచ్చుకున్నా చంద్రబాబు సంతృప్తి చెందలేదని సమాచారం. ప్రజల్లో సానుకూలత ఉంటే తమ ప్రయత్నాలు ఫలిస్తాయి తప్ప.. జనంలో కొంచెం సానుకూలత కూడా లేకపోతే ఎంత గట్టిగా ప్రయత్నించినా జనం రారని టీడీపీ నేతలు సంజాయిషీ ఇచ్చుకున్నట్టు తెలుస్తోంది.
కందుకూరు ఘటనతోనూ మారని తీరు..
కందుకూరు ఘటనతోనూ పాఠాలు నేర్వని చంద్రబాబు ఆ తర్వాత కూడా అదే తరహాలో ఇరుకుసందుల్లో సభలు నిర్వహిస్తున్నప్పటికీ జనం లేక సభలు, రోడ్ షోలు వెలవెలబోతున్నాయి. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన మచిలీపట్నం, గుడివాడ సభలు సైతం అట్టర్‌ప్లాఫ్ అయ్యాయి.
జనం రాక కోసం చంద్రబాబు గంటల తరబడి నిరీక్షించి చివరకు సభలో ఉపన్యాసం మొదలుపెట్టినా ఆ ప్రాంగణం ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. మరీ ఖాళీ స్థలాలైతే అటు ఇటు ఫ్లెక్సీలు అడ్డుగా పెట్టి తక్కువ విస్తీర్ణం ఉన్న ప్రాంతంలో ఎక్కువ జనం వచ్చినట్టు చూపించే ప్రయత్నాలు కూడా ఫలించడంలేదు. మొత్తంగా ఎన్ని ఎత్తుగడలు వేసినా బాబు సభలు వెలవెలబోతుండటంతో టీడీపీ శ్రేణులకు మింగుడు పడటం లేదు.
Comments
Please login to add a commentAdd a comment