నాయకులు ఇగోకు పోకూడదు
టీడీపీ–జనసేన ఉమ్మడి బహిరంగ సభలో టీడీపీ అధ్యక్షుడు బాబు
నా మద్దతుదారులైతే నన్ను ప్రశ్నించకండి : పవన్ కళ్యాణ్
అన్నీ ఆలోచించే పొత్తు పెట్టుకున్నాం
సాక్షి, భీమవరం/తాడేపల్లిగూడెం: కోరుకున్న వారందరికీ సీట్లు ఇవ్వలేమని, నాయకులు ఎవరూ ఇగోలకు పోవద్దని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆ పార్టీ నేతలతో పాటు జనసేన నేతలకూ హితబోధ చేశారు. బుధవారం పెంటపాడు మండలం ప్రత్తిపాడు జాతీయ రహదారి బైపాస్ పక్కన జరిగిన టీడీపీ, జనసేన పార్టీల తొలి ఉమ్మడి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రెండు పార్టీలు కలిసి నిర్వహించిన ఈ మొదటి సభ రాష్ట్రం దిశను మార్చబోతోందన్నారు. ఇప్పటికి 99 సీట్లు ప్రకటించామని, మిగిలినవి త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.
1.3 కోట్ల మంది ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేయడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. అందువల్ల కోరుకున్న వారందరికీ సీట్లు రావని స్పష్టం చేశారు. ప్రజల్లో ఉండే వాళ్లనే గుర్తించి అభ్యర్థులుగా ప్రకటిస్తున్నామన్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చూస్తామని, బీసీ, ఎస్సీ డిక్లరేషన్ ప్రకటనతో పాటు ఎస్టీలు, మహిళలు, ఉద్యోగులు, రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ మేరకు త్వరలో ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
నాకు సలహాలివ్వొద్దు
తాను 24 స్థానాలు తీసుకుంటే ఇంతేనా అని కొందరు అంటున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనకు సలహాలు, సూచనలు ఇచ్చే వాళ్లు అవసరం లేదని స్పష్టం చేశారు. యుద్ధం చేసే వాళ్లు కావాలని అన్నారు. 2014లో పార్టీని ప్రారంభించినప్పుడు పోటీ చేయకుండా రాష్ట్రం కోసం టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే పోరాటం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. గతంలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయి మానసికంగా కుంగిపోయానని, దక్షిణాఫ్రికాలో గాందీజీని గెంటివేసిన సందర్భాన్ని గుర్తుచేసుకుని స్ఫూర్తి పొందానని తెలిపారు.
సంస్థాగతంగా పాతుకుపోయిన తెలుగుదేశం పార్టీతో పోటీ పడలేమని, తన వ్యూహాన్ని ఎవరూ తప్పు పట్టవద్దన్నారు. జగన్‌ను ఆయన వెనుక ఉన్న సమూహం ప్రశ్నించదని, మీరు నన్నెందుకు ప్రశ్నిస్తున్నారంటూ జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులను ప్రశ్నించారు. తనతో నడిచే వాళ్లే తన వాళ్లని, నిజంగా తన మద్దతు దారులైతే తనను ప్రశ్నించొద్దని ఆదేశించారు. తనకు తెలుగుదేశం పార్టీలా బూత్‌లెవల్ వరకు పనిచేసే బలమైన నెట్‌వర్క్ లేదన్నారు. కోట్ల రూపాయల అక్రమ సంపాదన లేదన్నారు. 24 సీట్లతోనే ప్రభంజనం సృష్టించి తాడేపల్లి ప్యాలెస్‌ను బద్దలు కొడతామని చెప్పారు.
యువతకు 10 కిలోల బియ్యం, రూ.5 వేలు ఇవ్వడం కాదని, వారికి 25 ఏళ్ల భవిష్యత్తు ఇస్తామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే పొత్తులు పెట్టుకున్నానని తెలిపారు. ఇదిలా ఉండగా సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రసంగం అయోమయానికి గురిచేసింది. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కాలేదు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ పదవికి రాజీనామా చేసిన కనుమూరి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.. టీడీపీ– జనసేన కూటమి నుంచి నర్సాపురం పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తానని తనంతకు తానుగా ప్రకటించుకున్నారు. ఈ సభకు కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి బండారు శ్రీనివాసరావు గైర్హాజరయ్యారు.
వినకపోతే వారి ఖర్మ: హరిరామ జోగయ్య
సాక్షి, అమరావతి: ఒకరి మంచి కోసం సలహాలు ఇస్తే వాటిని పట్టించుకోకపోతే అది వారి ఖర్మ అంటూ పార్లమెంటు మాజీ సభ్యుడు హరిరామజోగయ్య అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. తెలుగుదేశం, జనసేన పార్టీల బాగు కోసం తాను ఇస్తున్న సలహాలు ఆ పార్టీల అధినేతలకు నచ్చుతున్నట్లు లేదన్నారు. అది వారి ఖర్మ.. ఇక తాను చేసేదేమీ లేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment