సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక ముసుగు రాజకీయాలు చేస్తూ వచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇప్పుడు పరామర్శల పేరుతో బహిరంగంగానే పరస్పరం మద్దతు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. తామిద్దరం వేర్వేరు కాదని, ఒక్కటేనని నిరూపించుకుంటూ ఆదివారం మరోసారి కలిశారు. రెండు నెలల క్రితం చంద్రబాబు పవన్‌ను కలిసి పరామర్శించగా, ఇప్పుడు చంద్రబాబును పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ పరామర్శలు నిజంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమా లేక రాజకీయం కోసమా అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోంది. అయినా ఇరు పార్టీల అధినేతలు బయటికి ఒకటి చెబుతూ.. లోపల మరొకటి చేస్తున్నారు. ఇరు పార్టీలు కలవకపోతే టీడీపీ పుట్టి పూర్తిగా మునగడం ఖాయం అని తాజాగా బాబు కుప్పం పర్యటనలో తెలిసిపోయిన నేపథ్యంలో ముసుగు తొలగించేందుకు సిద్ధమైపోయారు.
పవన్ పరామర్శించాల్సింది ఎవరిని?
హైదరాబాద్‌లో ఆదివారం చంద్రబాబు, పవన్ నిర్వహించిన సంఘీభావ సమావేశం ఎవరి కోసం? అని సర్వత్రా చర్చ జరుగుతోంది. కుప్పంలో ప్రజాదరణ లేక.. జరిగిన ఘటనల నేపథ్యంలో చంద్రబాబును పరామర్శించేందుకు వచ్చినట్లు పవన్ నర్మగర్భంగా చెప్పారు. కుప్పంలో చంద్రబాబును అడ్డుకున్నారని, ప్రతిపక్షాలను అడ్డుకోవడానికి జారీ చేసిన జీఓ నెంబర్ 1ను వెనక్కి తీసుకునేలా చేయడం కోసం తాము కలిసి పని చేస్తామని ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్‌కు ఇక్కడే ప్రజల నుంచి ఒక ప్రశ్న ఎదురవుతోంది. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఈ జీవో ఇచ్చేందుకు దారితీసిన పరిస్థితులు పవన్‌కు తెలియవా? తన ప్రచార ఆర్భాటం కోసం చంద్రబాబు కందుకూరులో చిన్న రోడ్డుపై సభ పెట్టడం ద్వారా 8 మంది ప్రజలు చనిపోవడానికి కారణమయ్యారు.
ఆ తర్వాత గుంటూరులో కానుకల పంపిణీ అని ఆశపెట్టి పెద్ద సంఖ్యలో జనాన్ని రప్పించి, తొక్కిసలాట జరిగేలా చేసి, ముగ్గురు మృతి చెందడానికీ కారణమయ్యారు. ఈ రెండు ఘటనల్లో 11 మంది మృత్యువాత పడితే.. వారిలో ఏ ఒక్కరి కుటుంబాలను కూడా పవన్ పరామర్శించలేదు. పైగా ఈ ఘటనలేవీ పెద్ద విషయాలు కావన్నట్లు వ్యవహరించారు. అక్కడ చనిపోయిన కుటుంబాలను పరామర్శించాల్సిన పవన్.. అందుకు కారణమైన చంద్రబాబును పరామర్శించడం వింతల్లో కెల్లా వింత. ఇప్పటంలో రోడ్లను ఆక్రమించుకున్న వారిని పరామర్శించిన పవన్‌కు.. కూలి డబ్బుల కోసం ఆశపడి సభలకు వచ్చి చనిపోయిన వారిని పరామర్శించేందుకు మాత్రం మనసు రాలేదు. తన సభలకు జనం రాకపోవడంతో ఇరుకు సందులు, కానుకల పేరుతో పేదలను మభ్యపెట్టిన విషయం చర్చకు రాకుండా, కేవలం తమను ఆపడానికే రోడ్లపై బహిరంగ సభలు పెట్టకూడదనే జీఓ ఇచ్చారని కొత్త పల్లవి అందుకున్నారు. జనం చచ్చిపోయినా పర్వాలేదు.. తాము మాత్రం ఏ సందులోనైనా, గొందులోనైనా సభలు పెడతాం, తమను ఎవరూ ప్రశ్నించకూడదని చంద్రబాబు, దత్తపుత్రుడు ఈ సమావేశం ద్వారా కుండబద్దలు కొట్టారు. దీనికి ప్రజాస్వామ్య పరిరక్షణ అనే ముసుగు వేశారు.
ఇక లాభంలేదని..
రెండు నెలల క్రితం ఇదే తరహాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంఘీభావ సమావేశం నిర్వహించారు. అందుకు విశాఖలో జరిగిన పరిణామాలను ఉపయోగించుకున్నారు. తన విశాఖ పర్యటనలో మంత్రులు, వారి అనుచరులపై జనసేన రౌడీ మూకలతో పవన్ దాడి చేయించి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అడ్డుకుంటే బాబు సూచన మేరకు పవన్ విజయవాడకు వచ్చి హల్ చల్ చేశారు. విశాఖలో తనను బయటకు రానీయలేదని రెచ్చిపోయి అధికార పార్టీ నేతలను దుర్భాషలాడుతూ, చెప్పు చూపిస్తూ నానా హంగామా చేశారు. ఆ సమయంలో మంత్రులపై జరిగిన దాడి, శాంతి భద్రతల అంశాన్ని పట్టించుకోకుండా దానికి కారణమైన పవన్‌కే ఎంతో అన్యాయం జరిగిపోయినట్లు తెగ బాధపడిపోయిన చంద్రబాబు ఉన్న పళాన తన ముసుగు తీసి పవన్‌ను విజయవాడ నోవాటెల్ హోటల్‌లో కలిసి సంఘీభావం ప్రకటించారు.
నిజానికి విశాఖ ఘటనలో బాధితులు ఎవరు, పరామర్శించాల్సింది ఎవరిని? ఇవేమీ జనానికి తెలియదన్నట్లుగా వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు వారిద్దరూ కలిసి ఒక అవకాశం సృష్టించుకుని అప్పట్లో కలుసుకున్నారు. అప్పటివరకు వేర్వేరుగా పని చేస్తున్నట్లు ప్రజలను ఏమార్చినా, ఇక లాభం లేదని ఇద్దరూ ఒక్కటేనని నిరూపించారు. ఆయా ఘటనల్లో బాధితులను పరామర్శించాల్సింది పోయి.. బాబు, పవన్‌లు ఇద్దరూ పరస్పరం పరామర్శలు ఏమిటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమని.. పవన్, చంద్రబాబులు ఇద్దరూ ఒక్కటేనని, ఎలాగైనా బాబుకు మేలు చేయాలని పవన్ తహతహలాడుతున్నారని, జనసేన కార్యకర్తలను బలి పశువులు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ మొదటి నుంచీ చెబుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాను ఎప్పటికీ బాబు మిత్రుడినేనని పవన్ తాజాగా మరోమారు నిరూపించుకున్నారు. ముసుగు లోపలి చిత్రం స్పష్టంగా కనిపిస్తున్నా, జనసేనాని మాత్రం తన కార్యకర్తలకు దగా చేస్తూ ఇంకా బీరాలుపోతున్నారు. పవన్ తీరు తమకూ అర్థం కావడం లేదని బీజేపీ నేతలు వాపోతున్నారు.
జనసేనకు చంద్రబాబు రోడ్‌మ్యాప్
తాజాగా చంద్రబాబు, పవన్‌ల భేటీలో తమ భవిష్యత్తు ప్రణాళికతోపాటు పవన్ ఎలా పని చేయాలి, ఏం చేయాలనే అంశాలపై చంద్రబాబు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం, సీట్ల కేటాయింపు, ఉమ్మడి రాజకీయం ఎలా చేయాలనే అంశాలపై చర్చ జరిగినట్లు టీడీపీ నేత ఒకరు తెలిపారు. ఈ సమావేశం జరిగిన వెంటనే జనసేనకు 30 సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని, అందులో కొన్ని స్థానాలు కూడా ఖరారయ్యాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక పేరుతో నిర్వహించే కార్యక్రమాలు, అక్కడ ఏం మాట్లాడాలి.. వంటి అంశాలపై చర్చించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment