సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్‌వెంకటస్వామి బీజేపీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపించారు. మరోవైపు తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన తనయుడు వంశీతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
పార్టీలో ఉన్నంతకాలం ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేసిన వివేక్.. బీజేపీకి తన రాజీనామాకు గల కారణాల్ని మాత్రం లేఖలో వివరించలేదు.వివేక్ కాంగ్రెస్‌లో చేరతారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే అది ఉత్త ప్రచారమేనన్న ఆయన.. బీజేపీ తరఫున పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తానంటూ ప్రకటించారు. అయితే.. ఇప్పుడు రాజీనామా ప్రకటించి కాంగ్రెస్‌లో చేరిపోయారు.
కాంగ్రెస్‌లోకి
బీజేపీకి రాజీనామా ప్రకటించిన వివేక్.. గంటల వ్యవధిలో కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. శంషాబాద్ నోవాటెల్‌లో ఉన్న రాహుల్‌తో వివేక్ భేటీ అయ్యారు. కొడుకు గడ్డం వంశీతో కలిసి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
కొడుకు కోసమే కాంగ్రెస్‌లోకి..
కాంగ్రెస్‌లోకి తిరిగి వివేక్ చేరికపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపడానికి కొడుకే కారణమని ప్రచారం వినిపిస్తోంది. కేవలం రాజకీయ వారసత్వాన్ని కొడుకుకు అందించే ఏర్పాట్లలో భాగంగానే ఆయన సొంత గూటికి తిరిగి చేరుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ విశ్లేషణకు తగ్గట్లే.. వంశీ కూడా గత కొద్ది రోజులుగా పొలిటికల్ పోస్టులతో రాజకీయాల్లో చేరడంపై సంకేతాలిస్తూ వస్తున్నాడు.
గడ్డం వంశీ 22 ఏళ్లకే విశాఖ ఇండస్ట్రీస్‌లో చేరి జేఎండీ బాధ్యతలు చేపట్టాడు. కంపెనీకి సంబంధించిన ఆవిష్కరణలలో భాగం కావడంతో పాటు సొంత యూట్యూబ్ ఛానెల్‌తో పలువురు ప్రముఖుల్ని ఇంటర్వ్యూలు సైతం చేశాడు. అయితే.. గత కొంతకాలంగా రాజకీయ అంశాలపై వంశీ పోస్టులు పెడుతూ వస్తున్నాడు. ముఖ్యంగా మణిపూర్ అల్లర్ల సమయంలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వంశీ పెట్టిన పోస్టులు(ఆ తర్వాత డిలీట్ చేశాడు) పెట్టడం చర్చనీయాంశంగా మారింది. వివేక్ తండ్రి గడ్డం వెంకటస్వామి ప్రయాణం కాంగ్రెస్‌లోనే జరిగింది. దీంతో. తాత బాటలోనే కాంగ్రెస్‌లోకే వెళ్దామని కొడుకు వంశీ నుంచి గడ్డం వివేక్‌పై ఒత్తిడి నెలకొందని, అందుకే ఆయన పార్టీ మారారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment