మీడియాతో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ భరత్ తదితరులు
తిరుపతి మంగళం: వచ్చే ఎన్నికల్లో కుప్పంలో ఓడిపోతానన్న భయం చంద్రబాబుకు పట్టుకుందని.. అందుకే మొన్న కుప్పానికి వచ్చినప్పుడు తన టీడీపీ గూండాలతో రౌడీయిజం చేయించాడని రాష్ట్ర అటవీ, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. తిరుపతి మారుతీనగర్‌లోని మంత్రి కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్తునిచ్చిన కుప్పానికి 35 ఏళ్లలో ఆయన ఏంచేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. కుప్పాన్ని పట్టించుకోకుండా, అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని పెద్దిరెడ్డి చెప్పారు.
కనీసం చిన్నపాటి అభివృద్ధి లేదా సంక్షేమ పథకాల ద్వారా కూడా చేసిందేమీలేదన్నారు. కానీ, మూడ్రోజుల క్రితం రామకుప్పం మండలంలోని కొల్లుపల్లి గ్రామంలో టీడీపీ నేతలతో అరాచకాలు సృష్టించి, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో రక్తంచిందేలా దాడులు చేసి రౌడీయిజం చేయించాడన్నారు. పోలీసులను సైతం తరిమితరిమి కొట్టారని, వారు కూడా ప్రాణభయంతో ఇళ్లల్లో దాక్కున్నారన్నారు. అయితే, పచ్చ మీడియాలో మాత్రం తామేదో చేసినట్లుగా చూపిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. తన సెక్యూరిటీని పెంచుకునేందుకు వైఎస్సార్‌సీపీ దాడులు చేస్తున్నట్లుగా సృష్టిస్తున్నాడన్నారు.
అధికారంలో ఉన్నన్నాళ్లు కుప్పంవైపు కన్నెత్తి చూడని చంద్రబాబు గత మూడేళ్లలో 6 సార్లు కుప్పం వచ్చాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. వచ్చిన ప్రతీసారి రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయడం, అరాచకాలు సృష్టించడం, రౌడీయిజం చేయడమే తన నైజంగా పెట్టుకున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని మాయలు చేసినా కుప్పం ప్రజలు ఆయన్ను నమ్మేస్థితిలో లేరన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలతోనే కుప్పం స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించిందని.. దాన్ని తట్టుకోలేకే చంద్రబాబు అక్కడ అరాచకాలు సృష్టిస్తున్నాడని పెద్దిరెడ్డి మండిపడ్డారు.
కుప్పానికి నీళ్లిచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తాం
మరోవైపు.. కుప్పంలోని బ్రాంచ్ కెనాల్‌లో నీళ్లు ఇవ్వలేదు, గాలేరు–నగరి కాలువ మొదలు పెట్టలేదు, పుంగనూరు బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయలేదని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వాటి కాంట్రాక్టర్ చంద్రబాబు అనుచరుడే కదా.. ఎందుకు చేయలేదని అతనిని ఎందుకు నిలదీయడంలేదని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా కాంట్రాక్టర్ స్పందించడం లేదని, దాంతో అతని కాంట్రాక్టును రద్దుచేసి కొత్త వాళ్లకు ఇచ్చి అతిత్వరలోనే ఆ పనులను పూర్తిచేస్తామని మంత్రి చెప్పారు. అలాగే, త్వరలోనే బ్రాంచ్ కెనాల్ పూర్తిచేసి కుప్పానికి నీళ్లిచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామన్నారు. హేమనూరు వద్ద డ్యామ్ నిర్మించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు.
పాలర్ ప్రాజెక్టును అడ్డుకున్న నీచుడు
ఏదైనా మాట్లాడితే రాష్ట్రం శ్రీలంకలా అయిపోయిందని, కిమ్ గురించి చెబుతాడని.. అసలు దేశ రాజకీయాల్లో పనికిమాలిన శుంఠ, వెన్నుపోటుదారుడు, నియోజకవర్గ ప్రజలకు ఏమీచేయని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు మాత్రమేనని పెద్దిరెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ఆగమేఘాలపై పాలర్ ప్రాజెక్టును ప్రారంభిస్తే లోపాయకారిగా అప్పటి తమిళనాడు ప్రభుత్వంతో చంద్రబాబు మాట్లాడి స్టే తెచ్చిన నీచుడన్నారు.
కుప్పంలో చంద్రబాబు ఓటమి తథ్యం
ఇక సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిత్యం కుప్పం ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కృషిచేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీ భరత్‌ను గెలిపించుకుంటే మంత్రి పదవి కూడా ఇస్తానని చెప్పారని గుర్తుచేశారు. జగన్‌మోహన్‌రెడ్డి పథకాలు కుప్పం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని, అందుకే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి తథ్యమన్నారు.
అలాగే, 14ఏళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు కుప్పం ప్రజలకు సెంటు భూమి ఇచ్చిన పాపానపోలేదని.. అదే జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే కుప్పంలో ఏడువేల మందికి ఇంటి స్థలాలిచ్చారని.. మరో మూడు వేలమందికి కూడా ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేశామన్నారు. ఇక తన కుమారుడు లోకేష్‌ను కూడా గెలిపించుకోలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నాడని.. ఆయన నాయకత్వ పటిమ ఎలా ఉందో అందరూ ఆలోచించాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు రెడ్డెప్ప, మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీ భరత్, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు పోకల అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment