జగన్‌ను తిడితే ప్రజలు ఓట్లు వేస్తారనుకోవడం మూర్ఖత్వం
వివేక చివరి కోరిక ఇప్పుడు గుర్తొచ్చిందా షర్మిల?
20 ఏళ్లుగా తండ్రిని ఒంటరిగా వదిలేసిన సునీత ఇప్పుడు
నీతులు చెప్పడం సిగ్గుచేటు
షర్మిల, సునీత తీరుపై నేషనల్ దళిత జేఏసీ అధ్యక్షుడు పెరికె వరప్రసాదరావు మండిపాటు
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుతో ఒప్పందం చేసుకుని మరీ సొంత అన్న వైఎస్ జగన్‌పై షర్మిల, సునీత విమర్శలు చేయడం మూర్ఖత్వమని నేషనల్ దళిత జేఏసీ అధ్యక్షుడు పెరికె వరప్రసాదరావు మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ వల్ల వైఎస్సార్ కీర్తి ప్రతిష్టలు పెరిగితే.. షర్మిల వల్ల దివంగత నేత ప్రతిష్ట దిగజారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల, సునీతలు చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్ చనిపోతే.. ప్రకృతి ఆగ్రహంతో పావురాల గుట్టలో మాంసపు ముద్ద అయ్యాడంటూ రేవంత్ వికృత విమర్శలు చేసిన విషయాన్ని షర్మిల మరిచిపోవడం దారుణమని పేర్కొన్నారు.
చరిత్ర పుటల్లో వైఎస్సార్ పేరు లేకుండా చేయాలని చంద్రబాబు ఎన్నో కుట్రలు, కుయుక్తులు పన్నాడని.. అటువంటి రేవంత్, చంద్రబాబు పంచన చేరి షర్మిల, అనీల్‌కుమార్, సునీత ఆడుతున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తన బాబాయి వివేకా చివరి కోరిక మేరకు కడప ఎంపీకి పోటీ చేస్తున్నానని షర్మిల చెబుతోందని, అదే నిజమైతే 2019లో ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. చనిపోయిన వైఎస్సార్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన కాంగ్రెస్ పంచన చేరడం దారుణమైతే.. అన్న వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడం మరింత దారుణమన్నారు.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ‘రుజువు కాని నేరారోపణలను అభ్యర్థిపై చేయకూడదని, అవేమి పట్టించుకోకుండా షర్మిల చేస్తున్న ఆరోపణలు, విమర్శలు దారుణమని పేర్కొన్నారు. వైఎస్ వివేకాను దాదాపు 20 ఏళ్లపాటు ఒంటరిగా వదిలేసి తన తల్లి సౌభాగ్యమ్మతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్న నర్రెడ్డి సునీత ఇప్పుడు నీతులు చెబుతున్న తీరు చూస్తే సభ్య సమాజం సిగ్గు పడుతుందని తెలిపారు.
వివేకాను గొడ్డలితో నరికి చంపానని, ఆయన మార్మాంగాలను చిద్రం చేశానని బాహాటంగా చెబుతున్న దస్తగిరికి బెయిల్ ఇప్పించడమే కాకుండా అతన్ని సంరక్షిస్తున్న సునీత ఇప్పుడు ఎవరికి అనుకూలంగా పలుకులు పలుకుతుందో జనం గమనిస్తున్నారన్నారు. వివేకా హత్యకు గురైన ప్రదేశంలో రక్తపు మరకలను శుద్ధిచేసిన నలుగురికీ నేటికీ జీతాలు ఇచ్చి పోషిస్తున్న సునీత ఇష్టం వచ్చినట్టు వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తే జనం సహించరని వరప్రసాదరావు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment