
సాక్షి, హైదరాబాద్: పెగాసెస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దేశవ్యాప్త పిలుపులో భాగంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఛలో రాజ్‌భవన్ కార్యక్రమం చేపట్టారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన బాట పట్టారు. ఈ సందర్భంగా ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసిన అనంతరం రాజ్‌భవన్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట, వాగ్వాదంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రాజ్‌భవన్ ముట్టడికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. పోలీసుల తీరును ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన ఇలా మాట్లాడారు.. ‘పెగాసస్ ఫోన్ ట్యాపింగ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల ఆందోళన బీజేపీ చేస్తున్న ఆగడాలు చూడలేక ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు.. స్వేచ్ఛ కోసం ఈ దేశంలో పోరాడాల్సి వస్తోంది. స్వాతంత్ర్యం తెచ్చుకున్నదే స్వేచ్ఛ కోసమని ఇప్పుడు ఆ స్వేచ్ఛనే హరించేశారు. స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలు, ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతల ఫోన్‌లు ట్యాప్ అవడం దారుణం. ఉగ్రవాదుల సమాచారం తెలుసుకునేందుకు వాడే సాఫ్ట్‌వేర్‌ను ప్రతిపక్షాలపై బీజేపీ వాడుతోంది. ఉగ్రవాదులను అంత మొందించాల్సింది పోయి.. ప్రతిపక్షాలను బీజేపీ అంత మొందిస్తోంది. ప్రతిపక్షాలు లేకుండా చేసి , నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోంది. ఈ దేశానికి స్వేచ్ఛను తీసుకువచ్చింది కాంగ్రెస్సే. ఆ స్వేచ్ఛను హరిస్తుంటే చూస్తూ ఊరుకోలేక ఆందోళన చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని కుప్పకూల్చినప్పుడే ఈ దేశ ప్రజాస్వామ్యం నిలబడుతుంది.’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment