శిరోముండనం ఘటనలో 24 గంటల్లోనే చర్యలు  | Pinipe Viswarup Fires On Harshakumar | Sakshi
Sakshi News home page

శిరోముండనం ఘటనలో 24 గంటల్లోనే చర్యలు 

Published Sat, Jul 25 2020 4:12 AM | Last Updated on Sat, Jul 25 2020 7:47 AM

Pinipe Viswarup Fires On Harshakumar - Sakshi

సాక్షి, అమరావతి/అమలాపురం టౌన్‌: శిరోముండనం ఘటన దృష్టికొచ్చిన 24 గంటల్లోనే ఎస్‌ఐతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ చర్యలు తీసుకున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌ గుర్తు చేశారు. ఇలా 24 గంటల్లోనే బాధ్యులైన ఎస్సైని, కానిస్టేబుళ్లను అరెస్టు చేసిన ఘటన చరిత్రలోనే లేదన్నారు. సీఎం ఆదేశాల మేరకు ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే తాను రాజమండ్రిలో బాధితుడిని పరామర్శించి న్యాయం చేస్తామని భరోసా కల్పించానని తెలిపారు. ఇది దళితుల పట్ల వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని చెప్పారు. మంత్రి విశ్వరూప్‌ శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో, తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. 

► కారంచేడు, చుండూరుల్లో దళితులను ఊచకోత కోసి వారి సమాధులపై నిర్మించిన పార్టీ.. టీడీపీ. నిన్నమొన్నటి గరగపర్రు వరకు టీడీపీ పాలనలో దళితులకు అన్యాయమే జరిగింది.
► శాసనసభ ఎన్నికల చరిత్రలో 99 శాతం ఎస్సీ రిజర్వుడు స్థానాలను గెల్చుకున్న పార్టీ.. వైఎస్సార్‌సీపీ. అలాంటి మా పార్టీపై నిందలు వేసి లబ్ధి పొందాలని బాబు చూస్తున్నారు. 
► శిరోముండనం ఘటనకు ఆధారాలు లభించిన వెంటనే బాధితుడు ప్రసాద్‌ చెప్పిన విధంగా కృష్ణమూర్తితో సహా ఎవరినైనా అరెస్టు చేస్తాం. 

హర్ష కుమార్‌ రాజకీయాలకు బెదరం
► మాజీ ఎంపీ హర్షకుమార్‌ సంస్కారహీనంగా, సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడారు. దళితుల పుట్టుకను కూడా రాజకీయం చేసిన ఆయన మనిషేనా?
► ఈ రాష్ట్రం మీ అబ్బ జాగీరా? మీ బ్లాక్‌మెయిల్, దివాళాకోరు రాజకీయాలకు మా పార్టీ నేతలెవరూ అదరరు, బెదరరు. నోరు జారితే నాలుక కత్తిరిస్తాం. 
► చంద్రబాబుపై అవిశ్రాంత పోరాటం చేశానంటున్న హర్షకుమార్‌ బహిరంగ సభలో ఆయన కాళ్లు ఎందుకు పట్టుకున్నారు? 
► ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ టికెట్‌ కోసం దళితులను తాకట్టు పెట్టాలని చూసిన హర్షకుమార్‌ ఇప్పుడు దళితుల గురించి మాట్లాడటమా? వాళ్లు మీ పేటెంట్‌ కానే కాదు. 
► 2014లో మీరు ఎంపీగా పోటీ చేస్తే వచ్చిన ఓట్లు 9 వేలు. మీ కుమారుడు పి.గన్నవరంలో పోటీ చేసి కోట్లు ఖర్చు చేస్తే వచ్చింది.. 600 ఓట్లు. మీ మాటలు దళితులెవరూ నమ్మరు. 
► కారంచేడు, పదిరికుప్పం, చుండూరు ప్రాంతాల్లో దళితులు ఊచకోతకు గురైనప్పుడు ఆయన ధర్నాలు చేసిన సందర్భాలే లేవు. 
► శనివారం చేపట్టబోయే నిరసనకు చంద్రబాబు మద్దతు ఇవ్వాలని హర్షకుమార్‌ అడిగారు. దీన్ని బట్టి ఆయన వెనుక ఉంది.. టీడీపీయేనని తెలుస్తోంది. 

దళితుల గురించి మాట్లాడే హక్కు టీడీపీ నేతలకు లేదు
► ఏనాడూ దళితులపై దాడులకు సంబంధించి నాటి టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. టీడీపీ దళిత నాయకులు మీ గత చరిత్రను ఒకసారి చూసుకోండి. 
► టీడీపీ హయాంలో దళితులకు రెండు మంత్రి పదవులు మాత్రమే ఇచ్చారు. వైఎస్‌ జగన్‌.. దళిత మహిళను హోంమంత్రిని చేయడమే కాకుండా ఐదుగురికి మంత్రి పదవులు ఇచ్చి ప్రధాన శాఖలను కట్టబెట్టారు. అందులో ఒక ఉప ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. 
► దళితులు, వారి సంక్షేమం గురించి మాట్లాడే హక్కు టీడీపీ నేతలకు లేదు. 
► ఐదేళ్ల టీడీపీ పాలనలో ఎంత ఖర్చుపెట్టారు? ఈ ఏడాదిగా మేం ఎంత ఖర్చుపెట్టామో బహిరంగ చర్చకు రండి.. మేం సిద్ధంగా ఉన్నాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement