
లఖింపూర్ ఖేరి ఘటనపై ఎట్టకేలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇవాళ్టి నుంచి మొదటి దశ పోలింగ్ జరుగుతుండగా.. నిన్న(బుధవారం) ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఘటనపై అడిగిన ప్రశ్నకు మోదీ స్పందించారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఐదు రాష్ట్రాల్లోనూ ప్రజలు తమ వైపే ఉన్నారంటూ ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైతులను కారుతో తొక్కించి చంపిన లఖింపూర్ ఖేరి ఘటనపై ప్రధాని మోదీ తొలిసారి నోరువిప్పారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసు దర్యాప్తులో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తున్నదని తెలిపారు. కేసు దర్యాప్తు ఆగబోదని అన్నారు. సుప్రీంకోర్టు ఎలా కొరితే ఆ విధంగా.. ఆ జడ్జీతోనే దర్యాప్తు చేసేందుకు యూపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమాధానం ఇచ్చారు.
ఇదిలా ఉండగా.. 2021 అక్టోబర్ 3న, మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ లఖింపూర్ ఖేరీ వద్ద నిరసనలు కొనసాగించారు. ఈ క్రమంలో రైతులపైకి దూసుకెళ్లిన SUVని అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా నడుపుతున్నాడు. లఖింపూర్ ఘటనలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు బలైన సంగతి తెలిసిందే. రెండు రోజుల తర్వాత ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయగా.. గత అక్టోబరు నుండి జైలులో ఉన్నాడు. అయితే ఈ ఘటనకు బాధ్యతగా అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ అతను హోం శాఖ సహాయ మంత్రిగా PM మోడీ ప్రభుత్వంలో కొనసాగుతున్నాడు. యూపీ పోలీసులు, పరిపాలనా యంత్రాంగం విచారణలో నిదానంగా సాగుతోందని ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది.
ఇక వ్యవసాయం చట్టాల రద్దు గురించి ప్రధాని తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘రైతుల ప్రయోజనాల కోసం వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చామని ఇంతకుముందు కూడా చెప్పాను, కానీ ఇప్పుడు దేశ ప్రయోజనాల దృష్ట్యా వాటిని ఉపసంహరించుకున్నాం. దీన్ని ఇకపై వివరించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఈ చర్యలు ఎందుకు అవసరమో భవిష్యత్తే స్పష్టం చేస్తుంది”అని ప్రధాని ఉద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment