రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు పాక్‌ నేతల ఆరాటం: ప్రధాని మోదీ | Sakshi
Sakshi News home page

రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు పాక్‌ నేతల ఆరాటం: ప్రధాని మోదీ

Published Thu, May 2 2024 2:48 PM

PM Modi latches onto former Pak ministe  praise of Rahul Gandhi

గాంధీనగర్‌: కాంగ్రెస్‌ పార్టీ, అగ్రనేత రాహుల్‌ గాంధీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శల వర్షం కురిపించారు. రాహుల్‌ ప్రధాని కానున్నారంటూ పాకిస్తాన్‌ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. వారిద్దరి (కాంగ్రెస్‌, పాకిస్థాన్‌) బంధం బహిర్గతమయ్యాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ యువరాజును ప్రధాని చేయడానికి పాక్‌ నేతలు ఆరాటపడుతున్నారని మండిపడ్డారు

గుజరాత్‌లోని ఆనంద్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ.. పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి రాహుల్‌ను ప్రశంసించండపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  దేశంలో కాంగ్రెస్‌ రోజురోజుకీ బలహీనపడుతోందన్నారు. హస్తం పట్టు కోల్పోతుండటంతో పాకిస్థాన్‌ ఏడేస్తోందని అన్నారు. ఉగ్రవాదాన్ని  పెంచి పోషిస్తున్న పాక్‌, కాంగ్రెస్‌ మధ్య భాగస్వామ్యన్ని బీజేపీ బహిర్గతం చేసిందని తెలిపారు.

‘కాంగ్రెస్‌ దేశంలో బహీనంగా మారుతోంది. మైక్రోస్కోప్‌లో వెతికినా కనిపించని పరిస్థితి వచ్చింది. కానీ కాంగ్రెస్‌ కథ కంచికి చేరుతుంటే పాకిస్థాన్‌ ఏడుస్తోంది. మరోవైపు రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రి చేయాలని పాక్‌ నాయకులు తహతహలాడుతున్నారు. ఆ పార్టీకి పాక్‌కు అభిమాని అని మనందరికీ తెలుసు. వారి భాగస్వామ్యం బయటపడింది.

భారత్‌లో బలహీన ప్రభుత్వం ఉండాలని మన శత్రువులు కోరుకుంటున్నారు. 26/11 ముంబయి దాడుల నాటి ప్రభుత్వం, 2014కు ముందున్న సర్కారు మళ్లీ అధికారంలోకి రావాలని ఆశపడుతున్నారు. అందుకే కాంగ్రెస్‌ కోసం పాక్‌ నేతలు ప్రార్థిస్తున్నారు’ అంటూ మోదీ మండిపడ్డారు. కాగా గుజరాత్‌లో 26 ఎంపీ స్థానాలకు లోక్‌సభ ఎన్నికలు మూడో ఫేజ్‌లో మే 7న జరగనున్నాయి.

ఇదిలా ఉండగా పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఫవాద్‌ హుస్సేన్‌ ఇటీవల తన సోషల్‌ మీడియా ఖాతాలో రాహుల్‌ గురించి ఓ పోస్ట్‌ పెట్టారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ నేత ప్రసంగించిన వీడియోను షేర్‌ చేసి.. ‘రాహుల్‌ ఆన్ ఫైర్‌’ అని రాసుకొచ్చారు. దీనిపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement