
సాక్షి, హైదరాబాద్: పాలమూరులో ‘ఎన్నికల శంఖారావ సభ’తో రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టనున్నారు. అక్టోబర్ 1 మధ్యాహ్నం ఒంటిగంటకు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ ఐటీఐ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగసభతో మోదీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కేసీఆర్ సారథ్యంలోని అధికార బీఆర్‌ఎస్ పాలన సాగిస్తున్న తీరుపై మొట్ట మొదటిసారిగా మోదీ పూర్తిస్థాయి రాజకీయ ప్రసంగం చేయబోతున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు.
జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నాయకత్వాన్ని కూడా అదే స్థాయిలో ఎండగడతారని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ఎజెండాను సెట్ చేసే విధంగా మోదీ సభ జరుగుతుందని అంటున్నారు. ఇక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోగానే మోదీ సహా హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభలతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించాలనే బిగ్‌ప్లాన్‌లో ఆ పార్టీ నిమగ్నమైంది. ఆ మేరకే ఈ సభలు జరగనున్నాయి.
వచ్చే నెల 10లోగానే అగ్రనేతల విస్తృత పర్యటనలు
ఇక మళ్లీ వెంటనే అక్టోబర్ 3నే నిజామాబాద్‌కు మోదీ రానున్నట్టు పార్టీవర్గాల సమాచారం. ఈ సందర్భంగా అక్కడ రోడ్ షో లేదా బహిరంగసభ నిర్వహించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్‌లో మోదీ పర్యటన తర్వాత...ఏయే తేదీల్లో, ఏయే ఉమ్మడి జిల్లాల్లో అమిత్‌షా, నడ్డాల సభలు పెట్టాలి, ఎన్ని సభలు నిర్వహించాలనే దానిపై నాయకత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. మొత్తంగా వచ్చేనెల 10వ తేదీలోగా షెడ్యూల్ వెలువడేలోగానే, పది ఉమ్మడి జిల్లాలు, 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ముగ్గురు అగ్రనేతల సభలు ముగించనున్నట్టు పార్టీనాయకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment