తెలంగాణ కాషాయ నేతల్లో అంతర్మథనం మొదలైంది. రోజురోజుకు నేతలు డీలా పడుతున్నారు. కనుచూపు మేరల్లో మునుపటి జోష్ కనిపించడం లేదు. తమ రాజకీయ నేతల భవితవ్యం ఏంటనే దానిపై నేతల్లో టెన్షన్ మొదలైంది. బీజేపీ యాక్షన్ ప్లాన్ కాగితాలకే పరిమితమవుతుందా ? అగ్ర నేతల క్లాస్‌లు ఒంట పట్టించుకోవడం లేదా?. కాషాయ గూటిలో ఇమడలేక పోతున్నారా?..
తెలంగాణలో అధికారమే లక్ష్యమని చెబుతున్న కమలనాథులు.. కార్యక్షేత్రంలో ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదో సాధిస్తామని ఆశించి కాషాయ కండువా కప్పుకున్న నేతల్లో టెన్షన్ మొదలైంది. పార్టీలో ముందుకు వెళ్లాలో.. వెనక్కి వెళ్లాలో తెలియక నాంపల్లి చౌరస్తాలో నిలబడ్డారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని తొలగించిన తర్వాత పార్టీ శ్రేణుల్లో జోష్ తగ్గిపోయింది. బీజేపీ కేడర్‌లో నిస్తేజం అలుముకుంది.
మాటలే.. చేతల్లేవ్..
ఇక, ఖమ్మంలో ‘రైతు గోసా– బీజేపీ భరోసా’ అంటూ అమిత్ షా సభ నిర్వహించారు. కానీ.. రైతులకు ఎలాంటి భరోసా.. హామీ ఇవ్వకుండానే సభను మమా అనిపించారు. ఏదో యాక్షన్ ప్లాన్ అమలు చేస్తాం.. మిషన్ 90 టార్గెట్ అంటూ గొప్పగా చెప్పిన నేతల జాడ లేకుండా పోయింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ఇక్కడే తిష్టవేసినా.. పెద్దగా వర్కవుట్ కావడం లేదని పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. బీజేపీ ప్రణాళికలు కాగితాలకే పరిమితం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
సీనియర్లు సైలెంట్..
చాలా రిస్క్ చేసి పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైలెంట్ మోడ్‌లో ఉన్నారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఉలుకు లేదు.. విజయశాంతి పలుకు లేదు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కనికనిపించకుండా ఉంటున్నారు. ఇక బండి సంజయ్ సైతం రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు.. పార్టీ కార్యాలయం వైపే కన్నెత్తి చూడరు.
ఇక ఇటీవల గెలిచిన ఎమ్మెల్సీ ఎవీఎన్ రెడ్డి పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. వీరంతా కాషాయ గూటిలో ఇమడలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. కలిసి కట్టుగా ఎన్నికల బరిలో దిగాలని పార్టీ హైకమాండ్ క్లాసులు తీసుకుంటున్నా.. తెలంగాణ కమలనాథులు మాత్రం ఆ చెవితో విని ఈ చెవితో వదిలేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి తెలంగాణ ఎన్నికల రణరంగంలో కమలం నేతలు నిలబడతారో ? చేతులెత్తేస్తారో ? చూడాలి.
ఇది కూడా చదవండి: కేసీఆర్ దూతను వెంటాడుతున్న చేదు జ్ఞాపకం.. ఈ పాట ఇంకెన్నాళ్లో?
Comments
Please login to add a commentAdd a comment