సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఘర్షణలకు సంబంధించి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు ఆదివారం అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. దాంతోపాటు ఆయన కుమారులు హర్షవర్ధన్, సాయిప్రతాప్‌పైనా హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి సహా మొత్తం 15 మందిపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. జేసీ తరపు లాయర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే, ఆయన తనయులు, అనుచరులపై కేసు నమోదు చేసినట్టు తాడిపత్రి డీఎస్పీ చైతన్య మీడియాకు తెలిపారు. ఇక తాడిపత్రి అల్లర్లకు కారణమైన మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి సహా 27 మందిపై పోలీసులు ఇప్పటికే మూడు కేసులు నమోదు చేశారు. ఇరువర్గాలపై మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి.
ట్విస్టు ఇచ్చిన జేసీ తరపు లాయర్
అయితే, ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కేసు నమోదు విషయంలో ట్విస్టు నెలకొంది. జేసీ లాయర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్తుండగా ఆయన యూటర్న్ తీసుకున్నారు. ఓ అర్జీ, సీసీ ఫుటేజీ, పెన్ డ్రైవ్ మాత్రమే పోలీసులకు ఇచ్చానని శ్రీనివాస్ తెలిపారు. తనను ఫిర్యాదుదారుడిగా పరిగణించొద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు లాయర్ శ్రీనివాస్ మీడియాకు ఓ నోట్ విడుదల చేశారు. అయితే, ఇదంతా జేసీ ఆడుతున్న డ్రామాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గం విమర్శలు గుప్పించింది.(చదవండి: తాడిపత్రి అల్లర్ల కేసులో కొత్త ట్విస్టు)
శాంతి నెలకొల్పేందుకే జేసీ ఇంటికి: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
రాష్ట్రంలో తాడిపత్రిపై నెలకొన్న దురభిప్రాయాన్ని పారదోలి, శాంతియుత వాతావరణం నెలకొల్పాలనే సదుద్దేశంతో చర్చించేందుకు జేసీ ప్రభాకరరెడ్డి ఇంటికి వెళ్లినట్లు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల్లో ఫాక్షన్ గొడవలు సృష్టించడం, దాడులు చేయించి, ఆస్తులు నాశనం చేసే సంస్కృతి తమకు లేదన్నారు. పెద్దవడుగూరు మండలం దిమ్మగుడి, చిన్నవడుగూరు, పెద్దవడుగూరు గ్రామాల్లో ల బ్ధిదారులకు శనివారం ఆయన ఇంటి పట్టాలు పంపిణీ చేసిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
బాధ్యతగా గుర్తించా
గ్రామాల్లో సమస్యలు తలెత్తితే వాటికి పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా తనపై ఉందన్నారు. తమ కుటుంబ సభ్యులపై జేసీ సోదరులు సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు సాగిస్తున్నారని, ఇది మితిమీరిపోవడంతో పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డిని నేరుగా కలిసి చర్చించేందుకే వారి ఇంటికి వెళ్లానన్నారు. ఫ్యాక్షన్ గొడవలు సృష్టించడం, దాడులు చేయించి ఆస్తులను నాశనం చేయడం తనకు తెలియదన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయ లబ్ధి కోసం టీడీపీ నాయకులు ఈ సమస్యను మరింత తీవ్రం చేసేందుకు ప్రయత్నిస్తుండడం సిగ్గుచేటన్నారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దు
ఏనాడూ ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అపోహలతో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు తెగబడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దంటూ హితవు పలికారు. టీడీపీ వారి దాడిలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారని, వీరి ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. వారిలో ఎవరికైనా దెబ్బలు తగిలి ఉంటే నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు.
పోలీసులు విచక్షణతో వ్యవహరిస్తున్నారు
జేసీ ఇంటిపై తామేదో దాడి చేసినట్లుగా అపోహలు సృష్టించి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నాలకు స్వస్తి చెప్పాలని టీడీపీ నేతలకు ఎమ్మెల్యే సూచించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు దాడులు చేశారంటూ, దీనిపై సుమోటోగా కేసులు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేయడం సిగ్గుచేటన్నారు. పోలీసులు విచక్షణతోనే వ్యవహరిస్తున్నారని, వారికి అన్ని విషయాలు తెలుసునన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ పంతం నెగ్గించుకునేందుకు పోలీస్ స్టేషన్ల ఎదుట జేసీ సోదరులు ధర్నా చేసినప్పుడు ఈ సుమోటో నినాదం ఏమైందని ప్రశ్నించారు. ప్రభోదానంద ఆశ్రమం వద్ద గొడవలు తలెత్తితే నివారించేందుకు ప్రయత్నించకుండా పోలీసులతో నేరుగా ఘర్షణ పడి ‘మీ చేతుల్లో లాఠీలు ఉంటే.. మా చేతుల్లో కర్రలు ఉన్నాయి’ అంటూ జేసీ సోదరులు బెదిరింపులకు దిగినప్పుడు సుమోటో నినాదం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. గతంలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలను ప్రజలు మౌనంగా భరిస్తూ వచ్చారని, ఇప్పుడు నిర్భయంగా సామాన్యులు సైతం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment