సాక్షి, అమరావతి : చెప్పిన మాటపై నిలబడకుండా తరచూ వైఖరులు మార్చుకునే చంద్రబాబు తాజాగా మరో యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో వైఎస్సార్‌సీపీ తన రాజకీయ వ్యూహకర్తగా ఐప్యాక్ వ్యవస్థాపకుడు పీకే (ప్రశాంత్ కిషోర్)ను నియమించుకున్నప్పుడు చంద్రబాబు, ఆయన పరివారం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయాలు చేతకాక ప్రతిపక్షం కన్సల్టెంట్‌ను పెట్టుకుందని చంద్రబాబు మీడియా సమావేశాలు, బహిరంగ వేదికలపైనా విమర్శించేవారు. ఎంతమంది పీకేలు వచ్చినా తమను ఏమీ చేయలేరని, చంద్రబాబు వెయ్యి పీకేలతో సమానమని టీడీపీ సీనియర్ నాయకులు సైతం చెప్పేవాళ్లు. చంద్రబాబు అపర చాణక్యుడని, ఆయన వ్యూహాల ముందు పీకే ఎంతని ధీమా వ్యక్తం చేసేవారు. చంద్రబాబు కూడా దేశంలోనే సీనియర్ నాయకుడినని, రాజకీయాల్లో తల పండిన వాడినని చెప్పుకోవడమే కాకుండా పీకే నియామకాన్నిచూపించి వైఎస్సార్‌సీపీని చులకనగా విమర్శించేవారు. కానీ 2019 ఎన్నికల్లో చంద్రబాబు చాణక్యం పని చేయలేదు. తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయింది. చివరికి చంద్రబాబు కుమారుడు లోకేష్ కూడా రాజధాని ప్రాంతంలోని మంగళగిరి నియోజకవర్గంలో ఓటమిపాలయ్యాడు.
అధికారం పోయాక కన్సల్టెంట్ల మార్గం అధికారాన్ని పోగొట్టుకుని నామమాత్రపు ప్రతిపక్షంగా మిగిలిన చంద్రబాబుకు ఏమీ చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గతంలో చెప్పిన మాటలు, చేతలకు విరుద్ధంగా తానే స్వయంగా ఒక రాజకీయ వ్యూహకర్తను నియమించుకున్నారు. అది కూడా పీకే దగ్గర పని చేసిన వ్యక్తే కావడం గమనార్హం. 2019 ఎన్నికలకు ముందు పీకే బృందంలో ఒకడిగా పనిచేసిన రాబిన్ శర్మ ఆ తర్వాత సొంతంగా షోటైమ్ కన్సల్టింగ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. దాదాపు ఆరు నెలలుగా ఆయనే తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో పూర్తి స్థాయిలో పని చేసేందుకు చంద్రబాబుతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు.
2024 ఎన్నికలకు ఆయన్నే చంద్రబాబు కన్సల్టెంట్‌గా నియమించుకోవడానికి రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. చాలా రోజుల నుంచి చంద్రబాబు తన వ్యూహాలను పక్కనపెట్టి రాబిన్ శర్మ వ్యూహాలనే అమలు చేస్తున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇటీవల చంద్రబాబు హిందూ మతం ప్రతినిధిగా మారిపోయి, క్రిస్టియన్‌లపై తీవ్ర స్థాయి ఆరోపణలు చేయడం కూడా అతని వ్యూహమేనని, కానీ అది విఫలమైందని టీడీపీలో చర్చ జరుగుతోంది. ఇవన్నీ ఎలా ఉన్నా కన్సల్టెంట్‌ను నియమించుకోవడం ద్వారా చంద్రబాబు మరోసారి యూటర్న్ తీసుకున్నారని ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
మాకో వ్యూహం చెప్పండి.. చంద్రబాబు మరో యూటర్న్
Published Thu, Jan 21 2021 4:38 PM | Last Updated on Thu, Jan 21 2021 6:46 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment