బీఆర్‌ఎస్ చార్జిషిట్‌పై మంత్రి పొంగులేటి ఫైర్
రాష్ట్రాన్ని గాడిన పెట్టడంలో ప్రజా ప్రభుత్వం విజయం సాధించింది
అధికారాన్ని కోల్పోయిన నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల పాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టడంలో ప్రజా ప్రభుత్వం విజయం సాధించిందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం, సమాచార.. పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. అధికారాన్ని కోల్పోయిన బీఆర్‌ఎస్ నాయకులు ఉక్కిరిబిక్కిరవుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చార్జిషీట్ అంటూ ఆ పార్టీ నివేదిక విడుదల చేసిందని, కానీ అది పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన డిశ్చార్జ్ రిపోర్ట్ అని ఎద్దేవా చేశారు.
ఆదివారం సచివాలయంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార..పౌరసంబంధాల శాఖల ప్రగతి నివేదికల విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ ధ్వంసం చేశారని, మొత్తంగా తుగ్లక్ పాలనను తలపించి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేశారని పొంగులేటి ఆరోపించారు. ప్రజల స్వేచ్ఛను హరించారని, పోలీసులను కార్యకర్తల్లా వాడుకున్నారని ధ్వజమెత్తారు. ధర్నాచౌక్‌ను ఎత్తివేసి ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావుకు ఇంకా జ్ఞానం రాలేదన్నారు.
ధరణి దరఖాస్తులన్నీ పరిష్కారమయ్యేలా చూస్తాం
‘ప్రజా ప్రభుత్వం వచి్చన వెంటనే ధరణిని ప్రక్షాళన చేసే ప్రక్రియను వేగవంతం చేశాం. పోర్టల్ నిర్వహణను గతంలో ఓ అంతర్జాతీయ సంస్థకు అప్పగించారు. దాన్ని ఈ ఏడాది డిసెంబర్ 1నుంచి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్‌ఐసీకి అప్పగించాం. ధరణి మాడ్యూల్స్ తగ్గిస్తున్నాం. పహాణీలో ఇదివరకు 33 కాలమ్స్ ఉండేవి. వాటిని 11 నుంచి 13 వరకే పరిమితం చేస్తున్నాం. ఇకపై ఆన్‌లైన్‌లో దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఆర్జీదారు సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాం.
ధరణి సమస్యల పరిష్కారానికి ఈ ఏడాది మార్చి 1 నుంచి 15 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. గతంలో పెండింగ్‌లో ఉన్న 2.46 లక్షల దరఖాస్తులతో పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా వచ్చిన 1.38 లక్షల దరఖాస్తుల్లో చాలావరకు పరిష్కరించాం. కొత్తగా ఆర్వోఆర్–2024 చట్టం సిద్ధమైంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభల్లో ఈ బిల్లును ఆమోదింపజేసి అమలు చేస్తాం.
పాత వీఆర్వో, వీఆర్‌ఏలకు పరీక్ష పెడతాం
‘గ్రామాల్లో రెవెన్యూ పాలనకు అధికారులుండేవారు. గత ప్రభుత్వం వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసింది. దీంతో పెద్ద సంఖ్యలో రెవెన్యూ సమస్యలు పేరుకుపోయాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామానికీ ఓ రెవెన్యూ అధికారిని నియమిస్తున్నాం. రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలున్నాయి. సంక్రాంతి తర్వాత ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉంటారు. ఇదివరకు పనిచేసిన వీఆర్వో, వీఆర్‌ఏలకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి గ్రామాలకు తిరిగి పంపిస్తాం.
ప్రజాపాలనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి తొలివిడత 4.5లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీఆర్‌ఎస్ పాలనలో పూర్తికాకుండా పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రజా ప్రభుత్వం పూర్తి చేస్తుంది..’అని మంత్రి చెప్పారు, ప్రజాపాలన విజయోత్సవాల తర్వాత జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి చర్చిస్తామని, ఆ తర్వాత సీఎంతో జరిగే మరో సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment