సింగరేణి కార్మికుల ల్యాంప్, చెమ్మాస్‌తో పొంగులేటి, జూపల్లి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడిన శక్తులు, వ్యక్తులంతా ఏకమవుతున్నారని, దానికి కొత్తగూడెంలోనే బీజం పడిందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి కొత్తగూడెంలో జరిగిన పొంగులేటి శ్రీనన్న అభిమానుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రభుత్వం, దాన్ని నడిపిస్తున్న సీఎం ఎనిమిదిన్నరేళ్ల కాలంలో చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదన్నారు.
ఉద్యమ సమయంలో, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు, ఇంటికో ఉద్యోగం, దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి, ఎస్సీల వర్గీకరణ, మైనారిటీ, గిరిజన రిజర్వేషన్ల పెంపు, రుణమాఫీ.. ఇలా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, ఈ ప్రభుత్వాన్ని మూడోసారి అధికారంలోకి ఎందుకు తీసుకురావాలని ప్రశ్నించారు.
తన కుటుంబం, పేరు ప్రఖ్యాతుల కోసం ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను రూ. 4.86 లక్షల కోట్ల అప్పుల్లోకి కూరుకుపోయేలా చేశారంటూ సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఆరోపణలు చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కారణంగా ఎందరో ఉద్యోగార్థులు ఇబ్బంది పడుతుంటే అరకొర చర్యలతో సరిపెట్టారని విమర్శించారు.
అప్పుల్లో సింగరేణి...
తెలంగాణ వచ్చినప్పుడు సింగరేణి రూ. 3,525 కోట్ల మిగులతో ఉండగా 2023 మార్చి 31 నాటికి రూ. 8,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని పొంగులేటి వివరించారు. 2014లో సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వ బకాయిలు రూ. 408 కోట్లు ఉండగా ఇప్పుడవి రూ. 24,300 కోట్లకు చేరాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనలో లాభాల్లో ఉన్న సింగరేణి అప్పులపాలైందన్నారు.
సింగరేణి కార్మికులు సరిహద్దులో సిపాయిలతో సమానమని ఉద్యమ సమయంలో చెప్పి... తెలంగాణ వచ్చాక వారిని ఘోరంగా అవమానించారని దుయ్యబట్టారు. గత ఎనమిదిన్నరేళ్లలో 123 మంది కార్మికులు చనిపోతే కనీసం ఒక్క కార్మికుడి కుటుంబాన్ని కూడా సీఎం పరామర్శించలేదని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎంలు వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు సైతం కార్మికుల కుటుంబాలను ఓదార్చారని ఆయన గుర్తుచేశారు. వారిద్దరి కంటే ప్రస్తుత సీఎం బిజీగా ఉన్నారా? అని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి: జూపల్లి
తెలంగాణలో ప్రజాస్వామ్యం అణచివేతకు గురవుతోందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే కొత్తగూడెం వచ్చి ఈ ఆత్మీయ సమ్మేళనంలో భాగం అవుతున్నానని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న పొంగులేటిని అభినందిస్తున్నాని చెప్పారు. రాష్ట్రానికి సీఎం అంటే ధర్మకర్త లాంటి వ్యక్తని, కానీ ప్రస్తుత సీఎం ఆ విషయాన్ని మరచి అంతా తాను, తనది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఎంత చదివినా, ఎన్ని శ్లోకాలు చెప్పినా, ఎంత మంచిగా మాట్లాడినా నిజాయతీ లేకపోతే వ్యర్థమని... ప్రస్తుత సీఎంలో ఆ నిజాయతీ లోపించిదన్నారు. మూడు పూటలా తిండి లేకపోయినా ఆత్మగౌరవం ముఖ్యమంటూ ఉద్యమ సమయంలో పోరాడామని, కానీ నేడు అది దక్కడం లేదని జూపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక ఉద్యమకారులపై అక్రమ కేసులు, స్టేషన్లలో చిత్రహింసలు పరిపాటిగా మారాయన్నారు. ధరణి పథకం మంచిదే అయినా అవినీతి ఆలవాలంగా మారిందని విమర్శించారు.
అవినీతి అధికారులకు సీఎం అండ...
కొల్లాపూర్ సంస్థానం పరిధిలో ప్రభుత్వానికి దఖలు పడిన 1,600 ఎకరాల భూమిని అవినీతి అధికారులు ప్రైవేటుపరం చేశారని... దీనిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా సీఎం చర్యలు తీసుకోకపోగా అవినీతి అధికారులకే అండగా నిలిచారని జూపల్లి ఆరోపించారు. వనపర్తి జిల్లాలో ఓ వంతెన నిర్మాణ విషయంలో రూ. 5 లక్షల బకాయిలు చెల్లంచాల్సిన చోట రూ. 26.30 కోట్లను అప్పనంగా ఈ ప్రభుత్వం చెల్లించిదన్నారు.
దీనికి ప్రతిఫలంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను అధికార పక్షంలోకి విలీనం చేసుకుందన్నారు. ఇలాంటి అవినీతి పనులు చేసి వాటినే ఆదర్శంగా చూపుతూ దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారా అంటూ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ లక్ష్యంగా జూపల్లి ప్రశ్నలవర్షం కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment