ఒకట్రెండు రోజుల్లో పేలబోతున్నాయి: మంత్రి పొంగులేటి
అందులో ప్రధాన నేతలే ఉంటారు.. ధరణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం తదితర అంశాల్లో సాక్ష్యాలను బయటపెడతాం
కక్ష సాధింపు చేయం..పూర్తి ఆధారాలతో ప్రజల ముందుపెడతాం
ఎంత పెద్దవారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు..
రెండు రిపోర్టులు ట్రాక్‌లో ఉన్నాయి.. అవి ప్రజలు కోరుకున్న విధంగా వస్తాయి
(సియోల్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి): ‘‘రాష్ట్రంలో ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి. దాంట్లో ప్రధాన నేతలు ఉంటారు. ధరణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంతోపాటు ఎనిమిది నుంచి 10 అంశాల్లో నిజాలు నిగ్గుతేల్చి ప్రజల ముందు ఉంచబోతున్నాం’’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణకొరియా పర్యటనలో ఉన్న ఆయన బుధ వారం సియోల్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘తప్పు చేసినవాళ్లు ఎంత పెద్దవాళ్లు అయినా వదలం.. అది విదేశీ కంపెనీయా? వారిని ఎలా ట్రేసవుట్ చేయాలి? వారి వెనుక ఉన్న తొత్తులు ఎవరు? వారి మధ్య జరిగిన లావాదేవీలేమిటి?.. ఇలా అన్నింటినీ నిగ్గుతేల్చి మా ప్రభుత్వం ప్రజల ముందు పెట్టనుంది. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
ఆధారాలతో సహా ఫైళ్లు సిద్ధమవుతున్నాయి
కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అక్రమాలు అంటూ ఆరోపణలు చేయ డమే తప్ప, ఇప్పటివరకు ఎలాంటి రుజువులు చూపలేకపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవు తోందని మీడియా ప్రతినిధులు పేర్కొనగా.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మేం సియోల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లిన తర్వాత రోజు తెల్లారో,మరోనాడో ఒకటో, రెండో బాంబులు పేలబోతున్నాయి. దాంట్లో ప్రధాన నాయకులే ఉంటారు.
ఈ ధరణికి సంబంధించి, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఇతరత్రా ఏవైతే ఎనిమిదో, పదో అంశాలు ఉన్నాయో.. తొందరపడో, ఉత్త పుణ్యానికో, అన్యాయంగానో వారిపై వేయాలన్నది కాదు. ఆధారాలతో సహా నిరూపిస్తాం. కాళేశ్వరంపై కమిషన్ వేశాం. త్వరలో దాని నివేదిక వస్తుంది. ధరణికి సంబంధించిన సమాచారం కూడా వస్తోంది. ఆల్రెడీ రెండు ట్రాక్‌లో ఉన్నాయి. ఆధారాలతో సహా ఫైళ్లు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే ప్రజల ముందుకు వస్తాయి’’ అని తెలిపారు.
కొత్త కాన్సెప్ట్‌లో ధరణి..
రాష్ట్రంలో ధరణి వచ్చిన తర్వాత ఒకే కాలమ్‌లో పేరు ఉంటే రైతుకు భూమి ఉన్నట్లు లేదంటే భూమి లేనట్లు అయిపోయిందని మంత్రి పొంగులేటి చెప్పారు. అదే ఇప్పుడు తాము 12 నుంచి 14 కాలాలు తీసుకొచ్చి.. ఆ భూమి స్వభావం, గతంలో ఎవరి దగ్గర ఉంది వంటి వివరాలన్నీ నమోదు చేస్తామని తెలిపారు. ‘‘భవిష్యత్తులో డాక్యుమెంట్‌లో ఎలాంటి అపార్థాలు లేకుండా ఉండేలా కాలాలు ఉంటాయి. ధరణి పేరు కూడా మార్చబోతున్నాం.
కొత్త కాన్సెప్ట్‌లో భూమి ఉన్న ప్రతి ఆసామికి పూర్తిగా క్లియర్ టైటిల్‌తో డాక్యుమెంట్ ఉండబోతోంది. ధరణిలో మొత్తం 35 మాడ్యూల్స్ ఉన్నాయి. ఏదైనా భూసమస్యపై దరఖాస్తు చేయాల్సి వచ్చినప్పుడు.. తెలిసో, తెలియకో ఒక మాడ్యూల్ బదులు మరో మాడ్యూల్‌లో దరఖాస్తు చేస్తే.. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా రిజెక్ట్ అవుతుంది.
మేం 35 మాడ్యూల్స్‌కు బదులు సింగిల్ డిజిట్‌లో మాడ్యూల్స్‌తో కొత్త కాన్సెప్ట్‌ను తీసుకురాబోతున్నాం..’’ అని పొంగులేటి తెలిపారు. విదేశీ సంస్థ చేతుల్లో నుంచి భూరికార్డుల నిర్వహణను తప్పించి.. భారత ప్రభుత్వ సంస్థ ఎన్‌ఐసీకి ఇచ్చామని చెప్పారు. 2024 రెవెన్యూ యాక్ట్‌ను ప్రజలకు అనుకూలంగా ఉండేలా తీసుకొచ్చామని.. అభద్రతతో ఉన్న లక్షల మంది రైతులు, భూములున్న ఆసాములకు భరోసాను కల్పించబోతున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment