సాక్షి, ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరతారనే దానిపై నెలకొన్న ఉత్కంఠ తొలగనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరుల్లో మెజార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరాలని చేసిన సూచనతో పొంగులేటి సైతం అదే నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు సన్నాహాలు చేసుకుంటున్న ఆయన.. శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల ముఖ్య నేతలతో ఖమ్మంలోని ఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో కీలక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌లో చేరాలని నేతలు ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ యుద్ధం ప్రకటించి 5 నెలలు అవుతోందని, నేనొక్కడినే యుద్ధం చేస్తే గెలవలేం. అందరం కలిసికట్టుగా యుద్ధం చేయాలి’’ అని పిలుపునిచ్చారు.
చదవండి: తెలంగాణ బీజేపీ నాయకత్వ మార్పు తప్పదా?
‘‘కార్యకర్తలు, ప్రజల అభిమానమే నా బలం. పదవులు ఉన్నా లేకున్నా ప్రజలతోనే ఉంటా. కార్యకర్తల అభిప్రాయాల మేరకు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటా. కార్యకర్తల నిర్ణయమే నా నిర్ణయం. హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి నిర్ణయం ప్రకటిస్తా. నా టార్గెట్ బీఆర్‌ఎస్.. వడ్డీతోసహా చెల్లిస్తా..’’ అంటూ పొంగులేటి వ్యాఖ్యానించారు.
‘‘ప్రజలను పట్టించుకోని ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తాం. నాపై విమర్శలు చేసేవారికి రాజకీయ సమాధి తప్పదు. ఖమ్మంలో కనీవినీ ఎరుగని రీతిలో బహిరంగ సభ ఉంటుంది. హైదరాబాద్ ప్రెస్‌మీట్‌లో బహిరంగ సభ తేదీ ప్రకటిస్తాం. నేను చేరబోయే పార్టీ అతిరథ మహారథులు సభకు వస్తారు’’ అని పొంగులేటి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment